Monday, November 18, 2024

మోడీ నాయకత్వం సంపూర్ణ వైఫల్యం

- Advertisement -
- Advertisement -

Modi’s leadership is complete failure on corona

 

ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు పాలకుడు మార్గదర్శనం చేయాలి. ప్రజలు అయోమయంలో ఉన్నప్పుడు పాలకుడు దారి చూపాలి. ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు పాలకుడు ఓదార్చాలి. ప్రజలు రేపు అనే దానిపై పై నిరాశతో ఉన్నప్పుడు పాలకుడు ఆశ చూపాలి, భరోసా నింపాలి. కానీ ప్రజలు గంపెడంత ఆశలతో గెలిపించిన ప్రజాస్వామ్య పాలకుడు ప్రజలను తానే స్వయంగా అయోమయానికి గురి చేస్తూ, తన విధానాలతో ఎనలేని దుఃఖానికి గురిచేస్తూ, రేపు అన్న దానిపై ఆశ లేకుండా చేస్తుంటే, ఆ పాలకుడు, ఆ నాయకత్వం, అచ్చంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం లాగానే ఉంటుందేమో అని ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఢిల్లీ పీఠంపై గద్దె ఎక్కడానికి ముందు అప్పటి ప్రభుత్వానికి అనేక సుద్దులు చెప్పి, దేశంలోని మధ్యతరగతి ప్రజల మనసులను మాటల మాయాజాలంతో ఆకట్టుకొని ప్రజామోదంతో పీఠమెక్కిన నాటినుంచి, దేశ ప్రధానిగా ప్రజలను తనదైన నిర్ణయాలతో విజయవంతంగా గందరగోళానికి గురి చేయడంలో విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన రైట్ వింగ్ శ్రేణులను సైతం ఏమాత్రం నిరుత్సాహపరచడం లేదు.

తన ఆరేళ్ల పాలనలో ఘనమైన నిర్ణయాలుగా చెప్పుకునే నోట్ల బంద్ మొదలుకొని తాజాగా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల జుగల్బందీ వరకు అన్నింటా విమర్శలను ఎదుర్కొంటున్న మోడీ పాలనా సామర్ధ్యం ప్రజలకు ప్రతిసారి పరీక్ష పెడుతూనే ఉన్నది. అయితే నలధనం, ఒకే దేశం, ఒకే పన్ను వంటి ఆకర్షణీయ నినాదాలతో నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి నిర్ణయాల్లో తనకు తన పార్టీకి అలవాటైన జాతీయవాద భావనను ప్రేరేపించి కాలం గడపడంలో కొంత విజయం సాధించారు. చేతలు మరిచి మాటలు చెబుతూ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాననే భావన విజయవంతంగా ప్రజల్లో చొప్పించగలిగారు. అయితే అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు చెప్పి పబ్బం గడుపుకునే నాయకత్వానికి కరోనా రూపంలో ఎదురైనా సవాలు, దేశ ప్రధాని మోడీ నాయకత్వ డొల్లతనాన్ని బట్ట బయలు చేసింది. కరోనాను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైన మోడీ నాయకత్వ సమర్ధతపైన ఇంటా బయటా ప్రశ్నలు, అనుమానాలు ప్రారంభం అయ్యాయి.

చాయ్ వాల నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మోడీకి ప్రపంచంలోనే ప్రముఖ నాయకుడిగా మారాలన్న కీర్తి కాంక్ష దేశ ప్రజలను ప్రాణాలను ఫణంగా పెట్టింది. తన ఆప్త మిత్రులు డోనాల్డ్ ట్రంప్, నెతన్యాహూ నుంచైనా కరోనా కట్టడి పాఠాలు నేర్చుకోలేదు. తాను ఎన్నికల్లో గెలుస్తానో లేదో అన్న అయోమయంలో ఉన్నప్పటికీ తన దేశ ప్రజల ప్రాణాలే ముఖ్యమని వ్యాక్సిన్ రాకముందే దేశ జనాభాకు సరిపడ వ్యాక్సిన్ కొనుగోలు చేసిన వారి దూరదృష్టి ముందు మోడీ కరోనా కట్టడి ప్రణాళికలు చిన్నబోయాయి. ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని భారత్ అంటూ అందుబాటులోకి వచ్చిన 7 కోట్ల వ్యాక్సిన్లను విదేశాలకు పంచి, కనీసం దేశ ప్రజల అవసరాలు వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలన్న కనీస ముందుచూపు లేని హ్రస్వదృష్టి కలిగిన నాయకత్వం ఈయనది. ఒకవైపు వందల కోట్లు ప్రజాధనం, పాలన పరమైన వెసులుబాట్లు ఫార్మా కంపెనీలకు అందించిన మోడీ, వ్యాక్సిన్ అనుమతుల తర్వాత వాటిని ముందుగా దేశ ప్రజలకే ఖచ్చితంగా ఇవ్వాలన్న నిబంధన పెట్టకపోవడం తనను ఎనుకున్న ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టడమే.

సాధారణంగానే బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా ఉండే ప్రభుత్వమనే ఒక విమర్శను నిజం చేసేలా మోడీ నిర్ణయాలున్నాయి. ప్రజల సొమ్ముతో, ప్రభుత్వమిచ్చిన సహకారంతో తయారైన వ్యాక్సిన్ల ధర నిర్ణయాన్ని ఫార్మా కంపెనీలు వదిలివేయడం, ప్రైవేటు కంపెనీలకు డబ్బులు దోచిపెడతారని మోడీ వ్యతిరేకులు చేసే ప్రచారాన్ని నిజం చేసేలా ఉంది. తలనొప్పి మందుల నుంచి మొదలుకొని ప్రాణాంతక క్యాన్సర్ మందుల వరకు అన్నింటికీ కొసరికొసరి ధరను నిర్ణయించే కేంద్రం, ప్రపంచ మహమ్మారి నుంచి ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్ ధరను నిర్ణయించడంలో తయారీదారులకు వదిలివేయడంలో ఖచ్చితంగా ఏదో ఆర్ధిక పరమైన కుమ్మక్కు ఉందని ప్రజలు భావిస్తున్నారు.

ప్రజా ప్రయోజనాల కోసం అనేక సందర్భాల్లో ప్రైవేట్ ఆస్తులను, సంస్థలను జాతీయం చేసిన చరిత్ర ఈ దేశానికి కొత్త కాదు. కానీ ప్రతిదానిలో దేశం కోసం,- ధర్మం కోసం అని చెప్పే మన ప్రధాని మాత్రం ప్రజలకు ప్రాణ వాయువుగా నిలిచే వ్యాక్సిన్లను మాత్రం కంపెనీలకే వదిలివేయడం అత్యంత దుర్మార్గం. వ్యాక్సిన్ ధరల నిర్ణయంలో మోడీ వ్యవహారం ప్రజల ప్రాణాలకు కార్పొరేట్ ఖరీదు కట్టడం మాదిరిగా ఉన్నది. ప్రపంచం మహమ్మారిని ఎదుర్కొంటున్న సందర్భంగా సార్వభౌమత్వం కలిగిన ఏ కేంద్ర ప్రభుత్వమైనా తన పరిధిలోని దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్లను సమకూర్చే బాధ్యతను ఒక బాధ్యతగా తీసుకుంటే, మన ఘనమైన ప్రజా నాయకుడి నాయకత్వంలో ఉన్న కేంద్రం మాత్రం ఈ బాధ్యత నుంచి అత్యంత బాధ్యతా రహితంగా తప్పుకుంది.

రాష్ట్రాలను సైతం వ్యాక్సిన్ వ్యాపారంలో కొనుగోలుదారులుగా మార్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్కటే అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. నాకైతే ఇంత, నీకైతే ఎంతన్న కానీ అంటూ వ్యాక్సిన్లకు మూడు రకాల ధరలు నిర్ణయించి, ఒకే దేశం- ఒకే పన్ను అంటూ జిఎస్‌టి కోసం తాను ఎత్తుకున్న నినాదానికి నిలువెల్లా తూట్లు పొడవడమే. ఇన్నాళ్లు తన నాయకత్వానికి సామాజిక మాధ్యమాల్లో బలంగా నిలిచిన 45 ఏళ్లకు తక్కువున్న యువతకు వ్యాక్సిన్ ఇవ్వడం తన బాధ్యత కాదంటూ చేతులెత్తిన మోడీ నాయకత్వం ఖచ్చితంగా వారి భవిష్యత్తుకు వెన్నుపోటు పొడవడమే అవుతుంది. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రతి సమయంలోనూ బిజెపి ప్రభుత్వం పారిపోతున్న పరిస్ధితి గత సంవత్సరం కాలంగా కనిపిస్తుంది. తప్పుల మీద తప్పులు చేస్తున్న మోడీ, దేశ ప్రజలకు అత్యవసరమైన ఉచిత వ్యాక్సిన్ అందించి ప్రజల పాలిట ఒక రక్షకుడిగా ఇమేజ్ సంపాదించుకునే అద్భుతమైన చారిత్రక అవకాశాన్ని జారవిడుచుకున్న తీరు, ప్రజల నాడిని పట్టడంలో పదే పదే విఫలమవుతున్న వస్తున్న మోడీలోని అంతర్ముఖ నాయకుడిని అందరికీ తెలిసేలా చేసింది.

మొదటి దశ కరోనా సమయంలోనూ ప్రపంచంలోనే అతి దీర్ఘకాలం పాటు లాక్‌డౌన్ పెట్టి చేతులు దులుపుకున్న మోడీ నాయకత్వంలో కన్నీళ్లు తెప్పించిన, ఆకలి కేకలు, వలస కూలీల నడకలు మరవక ముందే మరోసారి సెకండ్ వేవ్ ద్వారా వచ్చిన సంక్షోభం ప్రధాని నాయకత్వం, దీర్ఘ దృష్టి, ప్లానింగ్‌ను ప్రశ్నించి ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నది. ప్రపంచ దేశాలన్నీ సెకండ్ వేవ్ కరోనాకి సంసిద్ధంగా ఉండేందుకు తమ కార్యాచరణ ప్రకటిస్తుంటే, కేవలం రానున్న రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి కోసం జనవరిలోనే కరోనాని ఓడించామంటూ స్వయంగా ప్రధాని ప్రకటించడం అత్యంత బాధాకరం.

రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి రెండవ దశ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణను ప్రారంభించి ఉంటే, ఈ రోజు దేశంలో పరిస్థితి మరోలా ఉండేది. మొదటి దశ కరోనా అనుభవాల నుంచి కనీసం ఒక్క పాఠం కూడా మన ప్రధాని మోడీ ప్రభుత్వం నేర్చుకున్నట్లు కనిపించదు. చికిత్సకు అవసరమైన మందుల నుంచి మొదలుకొని ఆక్సిజన్ సరఫరా వరకు అన్నింట్లోనూ సంపూర్ణ వైఫల్యం కనిపిస్తుంది. రెండు నెలల కింద ప్రపంచ దేశాలన్నింటిలో కరోనాను తుద ముట్టించి సూపర్ మాన్ నేను అన్నట్లు వ్యవహరించిన వ్యాక్సిన్ డిప్లమసీ నడిపిన నరేంద్ర మోడీ నేడు బంగ్లాదేశ్, భూటాన్ వంటి అతి చిన్న దేశాల నుంచి మందులను, ఆక్సిజన్‌ను దేహి అని దేబిరించే పరిస్థితిలో ఉన్నారు.

ముమ్మాటికి ఈ పరిస్థితి భారతీయ జనతా పార్టీ భాషలో చెప్పాలంటే విశ్వ గురు లేదా రాజకీయ పరిభాషలో చెప్పాలంటే సూపర్ పవర్‌గా ఎదగాలనుకుంటున్న భారత దేశానికి ప్రపంచ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ఈ ప్రపంచ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రధాని నాయకత్వంలో జరిగిన ఘోర వైఫల్యం, గత కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయంగా భారత్ వివిధ రంగాల్లో సగర్వ విజయాలతో సాధించుకున్న ప్రతిష్ఠ ఖచ్చితంగా మసకబారుతుంది. రెండు నెలల కింద ప్రపంచ నాయకుడిగా ఎదగాలని కలలు కన్న ప్రధాని మోడీని, ఈ రోజు ప్రపంచ మీడియా ఒక విఫల నాయకుడిగా తూర్పారబడుతున్న తీరు ఇందుకు ఒక ఉదాహరణ.

ఒకప్పుడు భారతదేశానికి దొరికిన నూతన నాయకుడిగా, గేమ్ చేంజర్‌గా కవర్ పేజీలకెక్కిన మోడీ ఇమేజీ ఈ రోజు స్మశానాల ముందు గుట్టలుగా పేర్చిన శవాలు, ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లు, గంగలో కొట్టుకొస్తున్న వందల శవాల కవర్ ఫోటోల సాక్షిగా గంగలో కలిసిపోతున్నది. నాలుగేళ్ల కింద నూతన విధానాలు తీసుకురాగల నాయకుడిగా పొగిడిన ప్రపంచ మీడియా ఈ రోజు ఎన్నికల కోసం దేశ ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టిన ప్రధాని పాలనా తీరుపై అనేక నకారాత్మక కథనాలు అంతర్జాతీయ మీడియా హెడ్‌లైన్స్ నిలుస్తున్న తీరు మసక బారుతున్న మోడీ నాయకత్వానికి అద్దం పడుతున్నది. ఇప్పుడు భారతదేశానికి ప్రపంచ యవనికపైన దక్కుతున్న అవాంఛనీయ గౌరవాన్ని చూసి భారత మాత సైతం హర్షించదన్నది జీర్ణించుకోలేని పచ్చినిజం. ఇది కచ్చితంగా దేశ చరిత్రలో నిలిచిపోయే ఒక చీకటి కాలంగా ఉండబోతుందన్నది అందరూ అంగీకరిస్తున్న నిజం.

నిన్నటికి నిన్న జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ బిజెపి సాధించిన ఫలితాలు ఖచ్చితంగా అస్తమిస్తున్న సూరిడి మాదిరి, మోడీ నాయకత్వానికి ఒక హెచ్చరికగా చెప్పవచ్చు. బెంగాల్ ఎన్నికల కోసం బడ్జెట్‌లో రూ. 35 వేల కోట్లతో దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తామంటూ ప్రకటించి, ఎన్నికలు ముగియగానే మాటమార్చిన తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారు. కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టారన్న కోర్టుల మాటల సాక్షిగా కోవిడ్ నియంత్రణను ప్రాధాన్యత అంశంగా పరిగణించని మన ప్రధాని నుంచి అర్థవంతమైన ఆచరణ ఆశించడం అత్యాశ అవుతుందేమో అనిపిస్తుంది. ఇంతకు ముందు చెప్పినట్లు పాలకుడు మౌనం వహించి ప్రజల ప్రాణాలను గాలికి వదులుతుంటే ఖచ్చితంగా ఆ ప్రజలు అంతమవుతున్న తమ జీవితాల సాక్షిగా ప్రజాగ్రహాన్ని వెళ్ళగక్కడం ఖాయం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రజల వ్యతిరేకతతో ఎదురవుతున్న ఓటములను పరిగణనలోకి తీసుకొని, తన నాయకత్వం, పాలనా నిర్ణయాల పట్ల ఎదురవుతున్న అసంతృప్తిని, వ్యతిరేకతను అర్థం చేసుకొని ప్రజలకు అండగా నిలిస్తే తప్ప ఈ దేశ చరిత్ర ప్రస్తుత ప్రధానిని క్షమించదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News