Sunday, January 19, 2025

ఎఐ అయ్యారే… ప్రాంతీయ భాషలలో మోడీ స్పీచ్‌లు రెడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా ఈ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధ (ఎఐ) వినియోగానికి రంగం సిద్ధం అయింది. అత్యంత అధునాతనమైన ఎఐని అధికార పక్షం, పలు రకాల హంగులు ఉన్న బిజెపి విరివిగా వాడుకుంటుందని వెల్లడైంది. ప్రధాని మోడీ ప్రసంగాలను దేశంలోని ఎనిమిది ప్రాంతీయ భాషలలో అనువదించి, మోడీని మరింతగా ఓటర్ల వద్దకు చేర్చేందుకు ఎఐ సాంకేతికను వాడుకుని తీరాలని ఇప్పుడు బిజెపి ప్రచార వ్యూహకర్తలు సంకల్పించారు. నిజానికి ఈసారి ఎన్నికలకు ముందే తమిళనాడులో అన్నాడిఎంకె తమ పూర్వపు అధినేత్రి జయలలిత మాటలతో కూడిన సందేశాన్ని ఎఐ ప్రక్రియ ద్వారా ప్రజలకు విన్పించింది.

అచ్చం ఆమె ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడినతీరులోనే ఈ స్పీచ్ అప్పీలుగా అదిరింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల సభలలో పూర్తి స్థాయిలో తిరిగేందుకు, ప్రచారానికి దిగేందుకు కొన్ని ఇబ్బందులు ఉన్నందున బిజెపి అగ్ర నాయకత్వం ఇప్పుడు ఎఐ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సంకల్పించాయి. తన సందేశం మారుమూల ప్రాంతాలలోని పలువురు ప్రజలకు సరైన రీతిలో అందుతోందా? అనువాదకర్తలు ఏ విధంగా తర్జుమాలకు దిగుతున్నారనేది చాలా కాలంగా మోడీకి కొరుకుడు పడని ప్రశ్న అయింది. దీనితో పలు భాషలలో అనువదించిన ప్రసంగాలను కృత్రిమ మేధో సాంకేతికతతో రంగంలోకి తీసుకురావల్సి ఉందని గుర్తించారు. సాధనసంపత్తి బాగా ఉన్నందున వెంటనే దీనిని అమలులోకి తీసుకువస్తున్నారు.

ప్రత్యేకించి తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ , మరాఠా వంటి పలు భాషలలో ఇక మోడీ స్పీచ్‌లు ఆయన మాట్లాడినట్లే జనం చెవుల్లోకి దూసుకువెళ్లుతాయి. ఎన్నికల ప్రచారం దశలో ఇదో సరికొత్త మలుపు అవుతుంది. ఈసారి బిజెపి 370 ప్లస్ స్థానాలను సాధించాలని మోడీ సంకల్పించారు. ఇందుకు ముందుగా ఇప్పటివరకూ పార్టీ ప్రాబల్యం ఎక్కువగా లేని రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకృతం చేశారు. అందుకే ముందుగా దక్షణాదిలో ప్రచార హంగామా పెంచారు. తన ఒరిజనల్ ప్రసంగం వాస్తవికత దెబ్బతినకుండా చూసుకుంటూ పలు భాషలలో అనువాద ప్రసంగాలను రూపొందించాల్సి ఉందని తెలియచేశారు. దీనితో ఇప్పుడు బిజెపి హైటెక్, ఐటి విభాగం ఎఐ ప్రక్రియను వాడుకునేందుకు సమాయత్తం అయింది. ఉత్తరాదిలో హిందూత్వ పరిణామం, అయోధ్య ఇతర పరిణామాలతో ఓట్లు దండిగా తమ వైపు పడుతాయని బిజెపి ఆశిస్తోంది. అయితే బలం లేని చోట్ల లోపాలను సరిదిద్దుకునేందుకు అవసరం అయిన మరమ్మతులకు దిగారు. ప్రధాని మోడీ సందేశం నేరుగా వారి భాషల్లోనే ప్రజలకు చేరేందుకు రంగం సిద్ధం చేశారు.

కాశీ తమిళ్ సంగమంలో తొలిసారి ఆలోచన

ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రాంతీయ భాషలలో రూపొందించే ప్రక్రియ, సంబంధిత టెక్నాలజీ గత ఏడాది డిసెంబర్‌లో తొలిసారి ముందుకు వచ్చింది. అప్పుడు వారణాసిలో జరిగిన కాశీ తమిళ్ సంగమం కార్యక్రమంలో మోడీ స్పీచ్‌ను పూర్తి స్థాయి గ్రాంధిక తమిళంలో ఎఐ ద్వారా అనువదింపచేశారు. ఇది తమిళుల నుంచి విశేష స్పందనకు దారితీసింది. ఇక్కడ ఆరంభించిన ప్రక్రియ ఓ నూతనాధ్యాయం అవుతుందని, ఈ విధంగా ప్రజానీకానికి తనకు మధ్య ఎటువంటి భాషాపరమైన అగాధాలు ఉండవని తాను భావిస్తున్నానని అప్పట్లో ప్రధాని ఆ సభలో ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని ఒరిజినల్ ప్రసంగంలోని అంశాలు విశ్లేషణాత్మకంగా ఉంటాయి. అయితే ఆయన హిందీలో చేసే ప్రసంగం తర్జుమాల తరువాత ఎంత మేరకు ఉన్నదున్నట్లుగా ప్రజలకు చేరుతుందనే ఆందోళన ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు. ఇప్పుడు ఎఐ పరిజ్ఞానంతో ఈ సమస్య తీరిందని చెప్పారు.

తెలంగాణ, శ్రీకాకుళం యాసల్లోనూ

జాతీయ నేతల ప్రసంగాలను తమతమ భాషలలో వినడం ద్వారా జనం ఎంతో స్థానికతను సంతరించుకుంటారని , దీని వల్ల నేతలకు ప్రజలకు మధ్య దూరం చెరిగిపోతుందని పలువురు భాషాపరిజ్ఞాన ఎంపిలు ఇతర నేతలు స్పందించారు. ప్రత్యేకించి కేరళ, తమిళనాడు, పంజాబ్‌లలో ప్రధాని మోడీ ప్రసంగాలను అక్కడి భాషలలోనే ప్రసారం చేసేలా చూడాలని బిజెపి వర్గాలు సంకల్పించాయి. ఇక తెలుగురాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తెలుగును ఫక్కా యాసల్లో ఉండేలా చేయాలని కూడా అనుకుంటున్నారు. ఈ విధంగా మరింత స్థానికతను, ఇందులో జాతీయవాదాన్ని ధట్టించాలని, తాము కోరుకుంటున్న ఓట్లు సీట్ల పండుగను మరింతగా పండించుకోవాలని బిజెపి యమ ఆశతో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News