హైదరాబాద్: పద్మశ్రీ, కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య బిజెపి నేతల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బీజేపీ నేతలు తన నోట్లె మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు వెనుకా ముందూ ఏమీ లేదని, పేద కుటుంబం ఉన్నోడనని పేర్కొంటూ తనను రాజకీయాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చిన్నా చితకగా కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ అప్పుడప్పుడు పాటలు పాడేవాడినని, తన కళను తొలిగా టిఆర్‌ఎస్ ప్రభుత్వమే గుర్తించిందని వివరించారు.
సిఎం కెసిఆర్ తన కళను గుర్తించి రవీంద్ర భారతిలో ఆరేళ్ల క్రితమే సత్కరించారని గుర్తు చేసుకున్నారు. అప్పుడే తాను బయటి లోకానికి తెలిసానని వివరించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోలో వెల్లడించారు. తెలంగాణ జానపద సంస్కృతిని కాపాడాలనే తపన సిఎం కెసిఆర్‌లో ఉన్నదని కిన్నెర కళాకారుడు మొగులయ్య అన్నారు. తనను సీఎం కేసీఆర్ సత్కరించిన తర్వాత బయటి ప్రపంచానికి తెలిసానని, ఆ తర్వాతే ఓ సినిమాలో పాట పాడానని వివరించారు. పాట పాడిన తర్వాత కొన్నాళ్లకు తనకు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించిందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. తనను ఎవరూ పట్టించుకోలేదని, కెసిఆర్ ప్రభుత్వం మాత్రమే తనను గుర్తించిందని వివరించారు.