కరాచీ: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే టెస్టులు, వన్డేలకు వీడ్కోలు పలికిన హఫీజ్ కేవలం టి20లోనే కొనసాగుతూ వచ్చాడు. తాజాగా అంతర్జాతీయ టి20 నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం వెల్లడించాడు. నిజానికి 2020లోనే హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించాడు. కానీ కోవిడ్ కారణంగా ఆస్ట్రేలియాలో జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడింది. ఈ వరల్డ్‌కప్‌ను 2021లో యుఎఇ వేదికగా నిర్వహించారు. ఈ ప్రపంచకప్‌లో హఫీజ్ పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ వరల్డ్‌కప్ ముగిసి పోవడంతో ముందే ప్రకటించినట్టు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా కొన్ని రోజుల పాటు టి20లలో ఆడతానని హఫీజ్ స్పష్టం చేశాడు.
ఇక 2003లో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన హఫీజ్ పాకిస్థాన్‌లోని అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లలో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ బంతితో బ్యాట్‌తో రాణించాడు. 55 టెస్టుల్లో పాక్‌కు ప్రాతినిథ్యం వహించిన హఫీజ్ 37 సగటుతో 3652 పరుగులు చేశాడు. ఇందులో పది సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఒక డబుల్ సెంచరీ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాక టెస్టుల్లో 54 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక కెరీర్‌లో 218 వన్డేలు ఆడిన హఫీజ్ 6614 పరుగులు చేశాడు. ఇందులో 11 శతకాలు, మరో 38 అర్ధ శతకాలు ఉన్నాయి. దీంతో పాటు 139 వికెట్లు కూడా తీశాడు. మరోవైపు 119 ట్వంటీ20 మ్యాచుల్లో పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించిన హఫీజ్ 2514 పరుగులు నమోదు చేశాడు. ఇందులో రికార్డు స్థాయిలో 14 సెంచరీలు ఉండడం విశేషం. అంతేగాక టి20లలో 61 వికెట్లు కూడా హఫీజ్ పడగొట్టాడు. ఇక వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ హఫీజ్ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా మిలిలిపోనుంది. కాగా, పాకిస్థాన్‌కు పలు మ్యాచుల్లో ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టిన ఘనత హఫీజ్‌కు దక్కుతోంది. బ్యాట్‌తో, బంతితో హఫీజ్ అద్భుతంగా రాణించాడు.