ముంబై: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. వన్డే వరల్డ్‌కప్ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇక జాతీయ జట్టులోకి రావాలంటే ఎవరైనా సరే దేశవాళీ క్రికెట్‌లో ఆడాల్సిందేనని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఇటీవల కొత్త నిబంధనను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ నిబంధనను పాటించక పోవడంతో భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇషాన్‌పై క్రమశిక్షణ చర్యలకు దిగిన బిసిసిఐ ఏకంగా అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. అప్పటి నుంచి భారత క్రికెటర్లు బిసిసిఐ షరతు విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారు. తాజాగా షమీ కూడా బిసిసిఐ నిబంధనలకు అనుగుణంగా దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని నిర్ణయించాడు.
ఇప్పటికే ప్రాక్టీస్‌ను ప్రారంభించిన షమీ పశ్చిమ బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు డొమిస్టిక్ క్రికెట్‌ను వేదికగా చేసుకోవాలని షమీ భావిస్తున్నాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌ను సంతరించుకోవాలనే పట్టుదలతో షమీ ఉన్నాడు. కాగా, ఆరు నెలల నుంచి షమీ ఆటకు దూరంగా ఉన్నాడు. కాగా, దేశవాళీలో కనీసం మూడు మ్యాచ్‌లను ఆడాలనే లక్షంతో ఉన్నాడు. కాగా, రానున్న రోజుల్లో మళ్లీ భారత జెర్సీని ధరించడమే తన ముందున్న ప్రధాన లక్షమని షమీ పేర్కొన్నాడు. ఇందు కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతానని స్పష్టం చేశాడు.