నెలన్నర రోజులు కనులవిందుగా జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. అహ్మదాబాద్ లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాపై కంగారూలు ఆరు వికెట్ల తేడాతో గెలిచారు. ఈ టోర్నమెంటులో రికార్డుల పరంగా టీమిండియా ముందుంది. అందులో పేసర్ మహ్మద్ షమీ కూడా ఓ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన మొనగాడు అతనే. మొదటి రెండు మ్యాచ్ లకూ శార్దూల్ ఠాకూర్ ని తీసుకుని, షమీని స్టాండ్స్ కే పరిమితం చేశారు. అయితే మూడో మ్యాచ్ లో షమీ చేతికి బంతి ఇచ్చేసరికి చెలరేగిపోయాడు. ఇక అంతే, ఆ తర్వాత వరసగా ప్రతి మ్యాచ్ లోనూ వికెట్లను పడగొడుతూ, ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు.
ఆట సంగతి అలా ఉంచితే, ఈ ఫాస్ట్ బౌలర్ ఆస్తుల్లోనూ చాలామంది క్రికెటర్ల కంటే ముందున్నాడు. గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ఉన్నందువల్ల షమీకి బిసిసిఐ ఏటా ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఇక లీగ్ లు, ఫ్రాంచైజీల ద్వారా కూడా భారీ మొత్తంలో సంపాదిస్తున్నాడు. 2022లో షమీ గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్ లో ఆడాడు. అందుకు అతనికి టైటాన్స్ యాజమాన్యం 6.25 కోట్ల రూపాయలు పారితోషికంగా ఇచ్చింది. బ్లిట్జ్ పూల్స్, నైకే, ఆక్టా ఎఫ్ఎక్స్ వంటి బ్రాండ్లకు ప్రచారం చేస్తూ కూడా బాగానే కూడబెడుతున్నాడు. మొత్తంగా చూస్తే, షమీ వార్షికాదాయం 45 కోట్లు ఉంటుందని అంచనా.
ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో షమీకి అతిపెద్ద ఫామ్ హౌస్ ఉంది. 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫామ్ హౌస్… ఆ ప్రాంతంలో ఉన్నవాటిలో పెద్దది. దీని విలువ దాదాపు 15 కోట్లు ఉంటుందట. కార్లంటే షమీకి పిచ్చి. అతని గ్యారేజీలో ఇప్పటికే రకరకాల ఖరీదైన కార్లు కొలువుదీరి ఉన్నాయి. వీటిలో 99 లక్షల విలువ చేసే జాగ్వార్ ఎఫ్-టైప్ కారుతోపాటు బిఎండబ్ల్యు 5 సీరీస్ (రూ. 65-69 లక్షలు), ఆడి (రూ. 43 లక్షలు), ఫార్చూనర్ 9రూ. 33 లక్షలు) ఉన్నాయి.