ముంబై: ప్రపంచకప్‌లో ఆతిథ్య టీమిండియా వరుసగా ఏడో విజయం నమోదు చేసింది. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఓటమితో లంక ఇంటిదారి పట్టింది. వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 302 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా ఏడో విజయం కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 19.4 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
లంక పతనాన్ని శాసించే బాధ్యతను షమి తనపై వేసుకున్నాడు. తన తొలి ఓవర్‌లోనే షమి వరుసగా రెండు వికెట్లను పడగొట్టాడు. చరిత్ అసలంక (1), దుశాన్ హేమంత (0)లను షమి ఔట్ చేశాడు. అంతేగాక మాథ్యూస్ (12), దుష్మంత చమిరా (0), కాసున్ రజిత (14)లను కూడా షమి పెవిలియన్ బాట పట్టించాడు. ఇక మధుశంకా (5)ను జడేజా ఔట్ చేయడంతో లంక ఇన్నింగ్స్ 55 పరుగుల వద్దే ముగిసింది.