హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డా. మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, కాజా సూర్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావు, నరేష్, సి. కళ్యాణ్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘ఇది రాజకీయ వేదిక కాదు. ఇది కళాకారుల వేదిక. రాజకీయాలు ఇక్కడ ఉండకూడదు. కొందరు రాజకీయాల్లో ఉండొచ్చు.. కానీ ‘మా’లో మాత్రం రాజకీయాలు ఉండొద్దు. కళాకారులంతా ఒకే తల్లి బిడ్డలు. నేను ముందు నుంచి కూడా ఇదే చెబుతున్నాను. సీనియర్లను గౌరవించుకోవడం కూడా ఇప్పుడు మరిచిపోతున్నాం. ఎంతో మంది గొప్ప వాళ్లంతా కలిసి ‘మా’ను నడిపించారు. సినిమాలున్నాయా? లేదా? అని ముఖ్యం కాదు. సినిమాలు హిట్ అవుతాయి.. ఫ్లాప్ అవుతాయి. అది కాదు ముఖ్యం. ఎంత కష్టపడినా ఒక్కోసారి సక్సెస్ అనేది ఉండదు. మేం ఇంత మంది ఉన్నాం.. అంత మంది ఉన్నామని బెదిరించారు.
కానీ ‘మా’ సభ్యులు ఎవ్వరూ కూడా ఇక్కడ భయపడలేదు. ఒకరి దయాదక్షిణ్యాలతో అవకాశాలు రావు. టాలెంట్, క్రమశిక్షణ ఉంటే చాన్సులు వస్తాయి. మా ఓటు మా సొంతమని నా బిడ్డను గెలిపించారు. ఏమిచ్చి మీ రుణం తీసుకోవాలి. పానెల్ సభ్యులు భార్యబిడ్డలను వదిలి ఎన్నికల్లో పని చేశారు. నాకు రాగద్వేషాలు ఉండవు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడిని. ఇంత మంది మంచి మనుషులు నా బిడ్డను ఆశీర్వదించారు. మీరే మా దేవుళ్లు. ఓటు వేయని వాళ్ల మీద పగను పెంచుకోవద్దు. అవతలి వాళ్లకు కూడా నేను అవకాశాలు ఇస్తాను. భారతదేశం గర్వించదగ్గ ఖ్యాతిని ‘మా’కు తీసుకురావాలి. సభ్యత, సంస్కారంగా కేసీఆర్ను కలవాలి. ఈ ప్రమాణ స్వీకారం తరువాత కేసీఆర్ను కలుస్తాం. హీరోలు ఎన్నికలకు రాకపోయినా, ఓటింగ్ వేయకపోయినా ఈ అసోసియేషన్ అందరిది. మీ సహకారం కావాలి. కలిసి మెలిసి పని చేసుకుందాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేర్చుకుంటుంది. ఇది చిన్న ఉద్యోగమని కొందరు అంటారు. మీకు తెలియదా? ఇది చాలా పెద్ద బాధ్యత. అందరూ కలిసి మెలిసి పని చేసుకోండి. సభ్యుల్లో ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రెసిడెంట్కు చెప్పండి.
అంతేకానీ టీవీల్లోకి ఎక్కకండి. విష్ణు చేతిలో ఇప్పటికే మూడు సినిమాలున్నాయి.. విద్యానికేతన్ కూడా ఉంది. పైగా ‘మా’ బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ ఎలా చేస్తాడా? అని భయంగా ఉంది. చిత్రపురి కాలనీని హెరిటేజ్గా మార్చేద్దామని సీఎం అనుకుంటే.. దాన్ని అడ్డుకున్నాను. అది మా కళాకారుల కోసమే ఉండాలని నేను ముందుపడ్డాను. ఎవరు గుర్తు పెట్టుకున్నా లేకున్నా ఆ ప్రకృతికి తెలుసు. అందరం కలిసి మెలిసి ఉందాం. కలిసికట్టుగా పని చేసుకుందాం. నా బిడ్డ విజయానికి ఎంతో ముఖ్యమైన వాడు నరేష్. రెండు నెలలు తన సినిమాలు పక్కన పెట్టి మరీ విజయం కోసం పని చేశాడు. ఆయన నా మిత్రుడు కూడా కాదు. కానీ అన్నా నేనున్నాను అని వచ్చాడు. కృష్ణమోహన్ పక్షపాతం చూపించకుండా ఎన్నికలను నిర్వహించాడు. ఇక పైన అయినా టీవీలకు వెళ్లకండి. ఎక్కువగా రెచ్చగొట్టకండి. మనం అంతా కూడా ఒక్కటే. అందరూ బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.
Mohan Babu speech at MAA President Swearing Event