Sunday, December 22, 2024

మంచు కుటుంబం భేషరతుగా క్షమాపణ చెప్పాలి: ఆర్.కృష్ణయ్య డిమాండ్

- Advertisement -
- Advertisement -

నాయి బ్రాహ్మణ కులాన్ని కించపరిచిన
సినీనటుడు మోహన్‌బాబుపై చర్యలు తీసుకోవాలి
బిసి సమాజానికి మంచు కుటుంబం భేషరతుగా క్షమాపణ చెప్పాలి
జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: బిసి కులాల్లో అత్యంత వెనుకబడిన నాయి బ్రాహ్మణ కులాన్ని కించపరిచి, దుర్భాషలాడిన మంచు మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. బిసి కులాలకు, బిసి సమాజానికి మోహన్‌బాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం విద్యానగర్ బిసి భవన్‌లో నాయి బ్రాహ్మణ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ మోహన్ బాబు ఇంటిలో నాగ శ్రీను అనే వ్యక్తి కొన్ని ఏళ్లుగా హెయిర్ డ్రెస్సర్‌గా నమ్మకంగా పని చేస్తున్నారని, 11 సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు రూ.5లక్షల విలువగల వస్తువులు దొంగలించినట్లు తప్పుడు కేసులు బనాయించి కులం పేరుతో దూషించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మోకాళ్లపై నిలబడి ‘మంగళి కులం’ పేరుతో నానా దుర్భాషలాడుతూ వ్యవహారించిన తీరు సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసిలంటే అంత అలుసా? చిన్న చూపా? అని ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయకుండా అన్ని కోణాల్లో న్యాయవిచారణ పూర్తిగా చేసి బాధితుడికి అండగా నిలవాలని ఆర్.కృష్ణయ్య సూచించారు.
బిసిలకు బిసి అట్రాసిటీ చట్టం వర్తింపజేయాలి
డా. ఆకుల నందకిషోర్ మాట్లాడుతూ 75 సంవత్సరాల అనంతరం బిసిలపై కులం పేరుతో దూపించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టం మాదిరిగానే బిసిలకు బిసి అట్రాసిటీ చట్టం వర్తింపజేయాలని ఆయన ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. మంచు కుటుంబం రెండురోజుల్లోగా నాయి కులానికి, బిసి సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయి బ్రహ్మణ సంఘం నాయకులు బుద్ధారం ధన్‌రాజ్, జంపాల రాజేష్, గోలనుకొండ అశోక్, బిసి సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, డా.ఆకుల నంద కిషోర్, వికాస్, గురప్ప, నాయి బ్రహ్మణ విద్యార్థి సంఘం నాయకులు టి. వెంకట్, సతీష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Mohanbabu should apology to BC Communities: R Krishnaiah

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News