న్యూఢిల్లీ : ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిస్‌నుంచి నెలల వ్యవధిలో మరో ఉన్నత అధికారి వైదొలిగారు. సంస్థ ప్రెసిడెంట్ మోహిత్ జోషీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్టాక్ ఎక్స్‌చేంజికి కంపెనీ శనివారం తెలియజేసింది.‘ ఇన్ఫోసిస్ అధ్యక్షుడు మోహిత్ జోషీ ఈ రోజు రాజీనామా చేశారు. మార్చి 11నుంచి ఆయన సెలవులో ఉండనున్నారు. 2023 జూన్ 9 కంపెనీలో ఆయన చివరి పని రోజు’ అని సంస్థ తన ప్రకటనలో తెలియజేసింది. ఇన్ఫోసిస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ బిజినెస్‌కు నేతృత్వం వహిస్తున్న జోషీ 2000 సంవత్సరంలో సంస్థలో చేరారు. రెండు దశాబ్దాలకు పైగా సంస్థలో వివిధ స్థాయిలలో పని చేశారు. ఎడ్‌వర్వ్ సిస్టమ్స్‌కు చైర్మన్‌గా కూడా పని చేశారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు సంస్థ తరఫున జోషీ హాజరయ్యారు. ఆ సమయంలోనే ఆయన రాజీనామావార్తలు బయటికి వచ్చాయి.ఆ తర్వాత గోవాలో జరిగిన ఇన్ఫీ లీడర్‌షిప్ సమావేశంలో ఆయన పాల్గొనకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
కాగా ఇన్ఫోసిస్‌నుంచివైదొలగిన జోషీ మరో టెక్ సంస్థ టెక్ మహీంద్రాలో చేరారు.ఈ మేరకు టెక్ మహీంద్రా శనివారం ఓ ప్రకటనలో తెలియజేసింది. జోషీని తమ నూతన మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓగా పేర్కొంది. ప్రస్తుతం టెక్ మహీంద్రా సిఇఓ, ఎండిగా ఉన్న గుర్నానీ ఈ ఏడాది డిసెంబర్ 19న పదవీ విరమణ చేయనున్నారు. జోషీ అదే రోజు గుర్నానీ స్థానంలో బాధ్యతలు చేపడతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాగా ఇటీవలి కాలంలో ఇన్ఫోసిస్ వీడిన రెండో కీలక వ్యక్తి జోషీ. అంతకు ముందు గతఏడాదిఅక్టోబర్‌లో కంపెనీ వైస్‌ప్రెసిడెంట్ రవికుమార్ ఎస్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన కాగ్నిజంట్‌లో చేరి సిఇఓగా బాధ్యతలు చేపట్టారు.