మన తెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో సంచలనం రేపిన యువతి సజీవదహనం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హబీబ్ నగర్ ఎస్‌ఐ శివను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.అలాగే ఇన్‌స్పెక్టర్ రాంబాబుకు మెమో జారీ చేశారు. జనవరి 8న ఇంట్లో గొడవపడి మల్లెపల్లి నుంచి బయటకు వెళ్లగా గాలింపు చేపట్టిన యువతి తల్లిదండ్రులు 10వ తేదీ హబీబ్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. అయితే, మిస్సింగ్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. యువతి కోసం సెర్చింగ్ చేయడంలో నిర్లక్ష్యం చేశారు.
ఈ క్రమంలోనే పట్టపగలే గుర్తు తెలియని యువతి డెడ్ బాడీ సజీవదహనం అవుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిర్లక్ష్యంతోనే తమ కూతురు చనిపోయిందంటూ మృతురాలి పేరేంట్స్ ఆందోళన చేయడంతో స్పందించిన సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. హాబీబ్ నగర్ పోలీసులపై సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఎస్‌ఐ శివను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం యువతి సజీవదహనం ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు యువతి తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు గుర్తించారు. గతంలో కూడా తైసిన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. వ్యక్తిగత కారణాలతో పాటు కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.