Wednesday, January 22, 2025

సిఎం నామినేషన్‌కు పింఛనర్ల ఆసరా..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: విధి వంచితులైన తమ జీవితాల్లో వెలుగులు నింపి, ఆర్థిక భరోసాను, ఆత్మగౌరవాన్ని పెంచిన బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పట్ల ముఖరా కే గ్రామ పింఛనుదారులు ప్రేమాభిమానాలను, కృతజ్జత చాటుకున్నారు. తమకు నెల నెలా టంచనుగా అందుతున్న ఆసరా పింఛనులో నుంచి పొదుపు చేసుకున్న వెయ్యి రూపాయలను సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ నామినేషన్ ఖర్చుల కోసం ఉడతాభక్తి సాయంగా(ఆసరా)గా నిలవాలని నిర్ణయించుకున్నారు.

అదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలానికి చెందిన ముఖరా కే గ్రామం పలు రంగాల్లో ప్రతిభను చాటుకుంటూ దేశవ్యాప్త గుర్తింపుతో జాతీయ స్థాయి అవార్డులు అందుకుంటూ ఇప్పటికే ఆదర్శగ్రామంగా నిలిచింది. ఈ గ్రామంలోని ఆసరా పింఛనుదారుల నిర్ణయం.. మరోసారి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ గ్రామంలో వందమంది పింఛను పొందుతున్నారు. వారిలో వృద్ధులు, వంటరి మహిళలు, వికలాంగులు, వితంతు మహిళలు తదితరులు ఉన్నారు. వారందరూ తమ సర్పంచ్ గాడ్గె మీనాక్షిని కలిసి తలా వేయి రూపాయల చొప్పున లక్ష రూపాయల నగదును తెచ్చి సర్పంచ్ చేతిలో పెట్టారు.

తమ జీవితాలకు సామాజిక ఆర్థిక భరోసాను అందించిన సిఎంకు తమ పేరు మీద నామినేషన్ ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఇచ్చిరావాలని సర్పంచిని కోరారు. తమ గ్రామస్థుల ఔదార్యాన్ని సిఎం మీద ఉన్న ప్రేమను లక్ష రూపాయల రూపంలో మూటగట్టుకుని సిఎంని కలిసేందుకు, ఎంపి సంతోష్ కుమార్ సహకారంతో ప్రగతి భవన్‌కు చేరుకున్న గాడ్గె మీనాక్షి సిఎంను కలిసి తమ గ్రామస్థుల విజ్జప్తిని వినిపించారు. ముఖరా కే గ్రామ ఆసరా పింఛనుదార్ల ప్రేమాభిమానాలకు ముగ్దుడైన సిఎం కెసిఆర్ వారు పంపిన చందాను కృతజ్జతాపూర్వకంగా స్వీకరించారు. కాగా, తమ లక్షరూపాయల్లో సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ నామినేషన్ ఖర్చుల కోసం చెరో రూ.50 వేలను అందించాలనే వారి కోరిక మేరకు… సిఎం కెసిఆర్ పేరు మీద రూ.50 వేలు, కెటిఆర్ పేరు మీద రూ.50 వేలు చెక్కులను సర్పంచ్ గాడ్గె మీనాక్షి అంద జేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సిఎం, మంత్రి కెటిఆర్ కృతజ్జతలు తెలిపారు.

ముఖరా కే ప్రపంచానికే ఆదర్శ గ్రామం: సిఎం
ప్రభుత్వాలు నేతల నుంచి ఆసరా పొందే ప్రజలు ఉన్న పల్లెలను చూశాం గానీ, స్వయంగా గ్రామస్థులే తిరిగి సమాజానికి తిరిగి పంచుతున్న గొప్ప సందర్భాన్ని తెలంగాణలో మాత్రమే చూస్తున్నామని సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖరా కే పింఛన్‌దారులు తనకు నామినేషన్ ఖర్చుల కోసం ‘ఆసరా’ సాయాన్ని అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇప్పటికే ముఖరా కే గ్రామస్థులు సిఎం రిలీఫ్ ఫండ్ కోసం లక్ష రూపాయలు ఇచ్చిన విషయాన్ని సిఎం కెసిఆర్ గుర్తు చేసుకుని అభినందించారు. తెలంగాణ పల్లెల్లో వెల్లి విరుస్తున్న చైతన్యానికి ముఖరా కే గ్రామం ప్రతీకగా నిలుస్తున్నదని సిఎం అన్నారు. ఈ గ్రామం దేశంలోని పల్లెలకే ఆదర్శమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతమౌతున్నాయనడానికి ఈ గ్రామం దర్పణం పడుతున్నదని సిఎం వ్యాఖ్యానించారు. సిఎంను కలిసిన వారిలో ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ముఖరా కే ఎంపిటిసి గాడ్గె సుభాష్, దీపక్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News