Friday, November 15, 2024

తల్లి ఫోన్ కాల్.. 25మంది ప్రాణాలను కాపాడింది

- Advertisement -
- Advertisement -

తల్లడిల్లిన తల్లి … ఆ దేవి
ఫోన్‌కాల్‌తో కొడుకును కాపాడింది
తోడుగా 24 మంది ప్రాణాలనూ
ఉత్తరాఖండ్ జలవిలయ సమయాన
నది ఉగ్రతను పసికట్టి ముప్పు చెప్పింది

డెహ్రాడూన్: ఆ క్షణంలో కన్నతల్లికి ఏమన్పించిందో? గుండె కలుక్కుమందో? కుమారుడి ప్రాణాలకు ముప్పు ఉందని ముందే గ్రహించిందో? తెలియదు కానీ ఆమె చేసిన ఫోన్ కాల్ కొడుకుతో పాటు పాతిక మంది నిండు ప్రాణాలను కాపాడింది. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఈ నెల 7వ తేదీన మంచు శకలాలు విరిగిపడి జల ప్రళయం సంభవించింది. తపోవన్ జలవిద్యుత్ కేంద్రం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. జల విలయపు ఘట్టంలో పలువురు అసువులు బాశారు. 200 మందికి పైగా జాడ తెలియకుండా ఉన్నారు. అయితే తుదిక్షణాలలో కొందరు అనుకోకుండా ముప్పు నుంచి బయటపడ్డారు. ఈ విధంగా బతికి బయటపడ్డ వారిలో విపుల్ కైరెనీ బృందం కూడా ఉంది. విద్యుత్‌కేంద్రంలో వాడే ఓ భారీ వాహనానికి విపుల్ కైరేనీ డ్రైవర్‌గా ఉన్నారు. ప్రమాదం జరిగిన రోజు ఆదివారం, అయినప్పటికీ విధులకు వెళ్లితే రెట్టింపు కూలీ వస్తుందని, పనిచేస్తే రూ 600 దక్కుతాయని ఆశించి ఉదయం 9 గంటల డ్యూటీకి వెళ్లారు. విధులు నిర్వహిస్తూ ఉండగా ఆయన ఫోన్‌కు తల్లి మాంగ్‌శ్రీ దేవీ అదేపనిగా కాల్ చేసింది. ఉపద్రవం రానుందని తెలిపింది. కానీ తొలుత ఆమె మాటలను కొడుకు నమ్మలేదు. కానీ తల్లి వీడకుండా ఫోన్ చేస్తూ రావడం, వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లాని చెప్పడంతో ఆయన బయటకు వచ్చాడు. వెంట ఆయనతో పాటు విదులలో ఉన్న వారూ వెలుపలికి వచ్చారు. దీనితో తరువాత జరిగిన జల విధ్వంసం నుంచి వారు బయటపడ్డారు.
నది ఉధృతిని చూసి ముప్పు పసికట్టి
తమ గ్రామం కొండ ప్రాంతంలో ఉంటుందని, తల్లి ఇంటిబయట పనిచేస్తూ ఉండగా అక్కడి దౌలిగంగ ఉవ్వెత్తున ఎగిసిపడటం, ఇంతకు ముందు చూడని ఉగ్రరూపం దాల్చడంతో పల్లపు ప్రాంతాలకు ముప్పు అని తల్లి గుర్తించిందని అందుకే ఫోన్ చేసిందని కుమారుడు తెలిపారు. తాను తల్లి మాటను ముందు కొట్టిపారేశానని ఆయన తెలిపారు. కానీ వీడకుండా ఫోన్ చేయడం, బయటకు పోరా బిడ్డా అని ప్రాధేయపడటంతో తాను చేసేది లేక ఆమె చెప్పినట్లే చేశారని, దీనితో తాను మరో 24 మంది ఎత్తయిన ప్రాంతంలోని మెట్లపైకి చేరుకుని ఉన్నామని, ఈ లోగానే ఉధృత ప్రవాహం వచ్చిపడిందని, అంతా కళ్లముందే నేల మట్టం అయిందని కైరేనీ తెలిపారు. జన్మనిచ్చిన తల్లి హెచ్చరించి ఉండకపోతే తన జన్మ అర్థాంతరంగా ముగిసిపొయ్యేదని తెలిపారు. తాను, తనతో పాటు బయటపడ్డ వారందరం తల్లికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ప్రకృతి ఒడుపులు, ఉధృతాలు బాగా తెలిసిన తల్లి పరిసర పరిస్థితిని ముందుగానే పసికట్టి, పిల్లలను కాపాడిందని స్థానికులు చెపుతున్నారు. ఎన్‌టిపిసి హైడ్రోపవర్ ప్రాజెక్టు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది.

తల్లి గొప్పతనం పాతిక మందికి ప్రాణాలు నిలబెట్టింది. వెంటనే పనిచేస్తున్న చోటి నుంచి బయటకు వెళ్లాలని తల్లి బాగా తిట్టిపోసిందని, తాను నవ్వుతూ చాలా సేపు అక్కడనే ఉన్నానని, ఎందుకో తల్లి ఆర్థ్రతను గుర్తించి వెంటనే తనను రక్షించుకున్నానని, తన వెంబడి చావు భయంతో పరుగులు తీసిన వారూ ప్రాణాలతో ఉన్నారని కొడుకు చెప్పారు. పర్వతాలు ఎక్కడైనా కూలుతాయా? ఆకాశం పేలుతుందా? అమ్మా అంటూ ఆటపట్టించానని అయితే నవ్వులాటల సమయం కాదని చెప్పిందని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆదివారం ఈ ప్రాంతంలో సాధారణ స్థాయితో పోలిస్తే నదిలో నీటి మట్టం 15 మీటర్లు ఎత్తుకు వెళ్లడం తల్లితో పాటు తన భార్య అనిత కూడా గుర్తించిందని కైరేన్ తెలిపారు. ఇంతటి నీటి మట్టం ముందు ఏదైనా చుట్టుకుని పోవల్సిందే అని, చాలా మంది ఈ విధంగానే కొట్టుకుపొయ్యారని, తాము చావును తప్పించుకుని నిలిచామని కైరేన్ చెప్పారు. తమను ఎతైన ప్రాంతంలో ఉన్న మెట్లు రక్షించాయని అన్నారు. ఆరోజు ఇక్కడనే విద్యుత్ లైన్ల మరమ్మతులో ఉన్న సందీప్ లాల్ అనే వ్యక్తి తనకు దేవి అమ్మ మరుజన్మ ఇచ్చిందని కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. విపుల్ తల్లి తమకు ప్రాణం పోసిందని, ఈ జీవితంలో తాము ఆమెకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని లాల్ బావురుమన్నాడు.

Mom’s frantic calls saved 25 lives in Uttarakhand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News