Wednesday, January 22, 2025

అవినీతి అధికారి మెడలో కరెన్సీ నోట్ల దండ

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: మత్సకారుల సొసైటీల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏకంగా ఓ జిల్లా అధికారి మెడలోనే కరెన్సీ నోట్ల దండ వేసి ఆయన అవినీతిని బట్టబయలు చేశారు. ఓ వైపున ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, మరో వైపున జిల్లా అధికారి మెడలో నోట్ల హారం వేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… జగిత్యాల జిల్లా కేంద్రంలో మత్స శాఖ అధికారి దామెదర్ సొసైటీలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంపై నిత్యం అధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మత్స సొసైటీల ప్రతినిధులు ఆరోపించారు. సొసైటీల ఏర్పాటు కోసం లంచం ఇవ్వాలని జిల్లా అధికారి దామోదర్ డిమాండ్ చేస్తుండడంతో చేసేదేమి లేక ఆయన మెడలో కరెన్సీ నోట్ల దండలు వేశామని వారు వివరించారు.

మొదట అధికారి కార్యాలయంలోకి వెళ్లిన మత్సకారులు అతన్ని నిలదీసి కార్యాలయం నుండి బయటకు రాగానే ఆయన మెడలో హారం వేయడం సంచలనంగా మారింది. సాక్షాత్తు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనే మత్సకారులు వినూత్న రీతిలో నిరసన తెలిపిన తీరు హాట్ టాపిక్ గా మారింది. గతంలో మహారాష్ట్రంలోని ఔరంగాబాద్ లో ఓ సర్పంచ్‌ను అక్కడి అధికారులు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తన మెడలో కరెన్సీ నోట్ల దండలు వేసుకొని కార్యాలయం ముందు నిరసన తెలిపిన ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. తాజాగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మత్సకారులు డబ్బుల దండ వేయడం సరికొత్త చర్చకు దారి తీసింది.

చర్యలు తీసుకుంటాం: జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా
జగిత్యాల జిల్లా మత్స శాఖ అధికారి దామోదర్ పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపడతామని, ఆయన వివరణ తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష తెలిపారు. ఆయన ఇచ్చిన వివరణ తరువాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News