Monday, January 20, 2025

సిద్దరామయ్యపై మనీ లాండరింగ్ కేసు?

- Advertisement -
- Advertisement -

మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) స్థలాల కేటాయింపు వివాదంలో తాజాగా కర్నాటక లోకాయుక్త దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకుని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతోపాటు మరి కొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసును నమోద చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. మైసూరుకు చెందిన లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 7న సిద్దరామయ్య, ఆయన భార్య బిఎం పార్వతి, బావమరిది మల్లాకార్జున స్వామి, దేవరాజు(స్వామికి భూమి అమ్మిన వ్యక్తి)లను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. సిద్దరామయ్య భార్య పార్వతికి ముడా 14 స్థలాలను కేటాయించడంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదులపై కర్నాటక గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాడనికి అనుమతి మంజూరు చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన మరుసటి రోజే ప్రత్యేక కోర్టు నుంచి లోకాయుక్త పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

తన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు(ఇసిఐఆర్)లో సిద్దరామయ్యను నిందితుడిగా చేరుస్తూ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పిఎంఎల్‌ఎ) సెక్షన్లు నమోదు చేయాలని ఇడి భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. లోకాయుక్త పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను ఇడి పరిశీలిస్తున్నట్లు వారు చెప్పారు. పిఎంఎల్‌ఎ నిబంధనల ప్రకారం నిందితులకు ఇడి సమన్లు జారీచేయడంతోపాటు దర్యాప్తు సమయంలో వారి ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ఇడికి ఉంది. కాగా..తనను చూసి భయపడుతున్న ప్రతిపక్షం ముడా కేసులో తనను లక్షంగా చేసుకుందని, తనపై ఇది మొదటి రాజకీయ కేసని గత వారం సిద్దరామయ్య(76) వ్యాఖ్యానించారు. ఈ కేసులో తనపై దర్యాప్తునకు కోర్టు ఆదేశించినప్పటికీ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని కూడా సిద్దరామయ్య ప్రకటించారు. తాను ఏ తప్పు చేయలేదని, చట్టపరంగా ఈ కేసును ఎదుర్కొంటానని ఆయన తెలిపారు. సిద్దరామయ్య భార్య పార్వతి నుంచి ముడా సేకరించిన భూమి విలువ కన్నా ఆమెకు నష్టపరిహారంగా కేటాయించిన ప్లాట్ల విలువ చాలా ఎక్కువగా ఉందన్నది ఈ కేసుకు సంబంధించిన ప్రధాన ఆరోపణ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News