నిజమని నమ్మిన బాధితురాలు
రూ.6.40లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న నిందితుడు
రాచకొండ పోలీసులకు ఫిర్యాదు
విచారణ చేసి జాంతారా యువకుడిని పట్టుకున్న పోలీసులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: ఇరవై నాలుగు గంటల్లో సిమ్ గడువు ముగుస్తుందని వెంటనే యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి డబ్బులు దోచుకున్న సైబర్ నేరస్తుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్, ఆధార్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎటిఎం కార్డును స్వాధీనం చేసుకున్నా రు. పోలీసుల కథనం ప్రకారం… జార్ఖండ్ రాష్ట్రం, జాంతారా జిల్లా, మోహన్‌పూర్ పోస్ట్, సికార్‌పోసిని గ్రామానికి చెందిన బీర్బల్ పండిట్ స్థానికంగా వ్యాపారం చేస్తున్నాడు. స్థానికంగా కొందమంది కలిసి ముఠాగా ఏర్పడి సిమ్ బ్లాక్‌అవుతుందని ఫోన్లు చేసి బాధితుల బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన బాధితురాలకు గత నెల 17వ తేదీన మీ ఎయిర్‌టెల్ సిమ్ 24గంటల్లో గడువు ముగుస్తుందని మెసేజ్ వచ్చింది. ఇది చూసిన ఐదు నిమిషాల తర్వాత బాధితురాలికి సైబర్ నేరస్థులు ఫోన్ చేశారు. తాము ఎయిర్ టెల్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని వెంటనే టీమ్ వ్యూయర్ క్విక్ సపోర్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అప్‌డేట్ చేసుకోవాలని చెప్పాడు.
ఇది నిజమని నమ్మిన బాధితురాలు సైబర్ నేరస్థుడు చెప్పినట్లు చేసింది. యాప్ యూజర్ ఐడి, నిందితుడికి చెప్పింది. అతడు చెప్పినట్లు రూ.10 ట్రాన్స్‌ఫర్ చేసింది. దీంతో నిందితుడు బాధితురాలి బ్యాంక్ వివారాలు మొత్తం తెలుసుకుని ఆమె బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.6,40,000ను ఐదు ట్రాన్‌జాక్షన్ల ద్వారా వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు. తర్వాత బాధితురాలు బ్యాంక్ ఖాతాను చూసుకుని మోసపోయానని గ్రహించి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ శంకర్ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.