Monday, December 23, 2024

బాలరాముడి సేవలో వానరం!.. అయోధ్యలో అపురూప దృశ్యం

- Advertisement -
- Advertisement -

అయోధ్య: అయోధ్యలోని రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజే అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కొత్తగా నిర్మించిన ఆలయంలో ఇటీవలే కొలువుదీరిన రామయ్యను దర్శించుకోవడానికి ఆయన ప్రియ శిష్యుడైన హనుమతుడే వానర రూపంలో ఆలయ ప్రవేశం చేశాడని భక్తులు ప్రణమిల్లిన అపూర్వ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఈ అపురూప ఉదంతాన్ని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సోషల్ మీడియా వేదికైన ఎక్స్(పూర్వ ట్విట్టర్)లో నెటిజన్లతో పంచుకుంది. మంగళవారం సాయంత్రం 5.50 గంటల ప్రాంతంలో ఒక వానరం ఆలయంలోని దక్షిణ ద్వారం నుంచి గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారి ఉత్సవ విగ్రహం సమీపానికి చేరుకుంది. ఆ వానరాన్ని గమనించిన ఆలయ భద్రతా సిబ్బంది అది ఎక్కడ ఉత్సవ విగ్రహాన్ని నేల మీద పడేస్తుందోనని భయపడ్డారు. దాంతో వారు ఆ వానరాన్ని బయటకు పంపేందుకు అదలించారు.

తన వైపు వస్తున్న భద్రతా సిబ్బందిని చూసి ఆ వానరం నెమ్మదిగా ఉత్తర ద్వారం వైపు కదిలింది. అక్కడ ద్వారం మూసి ఉండడంతో అటు నుంచి తూర్పు ద్వారం చేరుకుని భక్తులతో కలసి బయటకు వెళ్లిపోయింది. ఆ వానరం ఎక్కడా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగచేయలేదని ట్రస్టు తన పోస్టులో పేర్కొంది. గతంలో తాత్కాలిక టెంటులో ఉంచిన రామ్ లల్లా విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో కొత్త విగ్రహం ప్రతిష్టాపనతో ప్రస్తుతం ఉత్సవ విగ్రహంగా పరిగణిస్తున్నారు. పాత విగ్రహాన్ని కూడా గర్భాలంలోనే ఉంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News