Thursday, January 23, 2025

మంకీపాక్స్!

- Advertisement -
- Advertisement -

Former Japanese Prime Minister assassinated మూడు కరోనా అలలు మృత్యు తిప్పలుపెట్టి మానవాళిని గడగడలాడించి గజగజ వణికించిన తర్వాత చెప్పుకోదగిన వ్యవధి ఇవ్వకుండానే మంకీ పాక్స్ రూపంలో మరో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. ఇంతవరకు 78 దేశాల్లో 18000 మందికి సోకిన ఈ అంటురోగం ఐదుగురిని బలి తీసుకొన్నది. వీరిలో వొకరు కేరళ రాష్ట్రానికి చెందినవారు. మసూచి (స్మాల్ పాక్స్) జాతికి చెందిన ఈ వ్యాధి ఒక ప్రత్యేక అంటుక్రిమి ద్వారా సంక్రమిస్తుందని చెబుతున్నారు. మితిమించిన శారీరక సాన్నిహిత్యం, ముఖ్యంగా సలింగ సంపర్కం నుంచి కలుగుతుందని భావిస్తున్నారు. అలాగని ఇదమిత్థమైన కారణమేదీ ఇంత వరకు వెల్లడైనట్టు లేదు. ఈ వైరస్ నుంచి తప్పించుకోవాలంటే అది సోకిన వారి నుంచి తగినంత భౌతిక దూరం పాటించాలి. ముందుగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో బయటపడిన ఈ వైరస్ విదేశాలకు వెళ్లి వచ్చిన వారిలోనే కాకుండా ఎక్కడికీ వెళ్లి రాని స్థానికుల్లోనూ కనిపించడం ఆందోళనకరం. అంతగా ప్రమాదకరం కాని పశ్చిమ ఆఫ్రికా రకం వైరస్ మాత్రమే ప్రపంచమంతటా వ్యాప్తిలో ఉంది.

జ్వరం, తలనొప్పి, వాపు, వెన్ను నొప్పి, కండరాల్లో నొప్పి ఈ వైరస్ సంకేతాలుగా గుర్తించారు. జ్వరంతో ప్రారంభమై సాధారణంగా ముఖం మీద పొక్కులు వచ్చి కుండలు వేస్తాయి. ఆ తర్వాత అవి శరీరమంతటా వ్యాపించి పెద్దవవుతాయి. ఇవి తీవ్రంగా బాధిస్తాయి. దీని తీవ్రత సాధారణంగా 14 నుంచి 21 రోజులు ఉండి తగ్గిపోతుందని చెబుతున్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తులకు దూరంగా ఉండడం, వారితో లైంగిక సంపర్కం లేకుండా చూసుకోడం అవసరం. వాస్తవానికి మంకీ పాక్స్‌ను 1958లోనే గుర్తించారు. డెన్మార్క్ ప్రయోగశాలలోని కోతులలో మొదటిసారిగా కనబడింది.

1970 నుంచి 10 ఆఫ్రికా దేశాల్లో అరుదుగా కనిపిస్తున్నది. మొట్టమొదటి సారిగా 2003లో ఆఫ్రికా బయట అమెరికాలో ఇది కనబడింది. 2017లో నైజీరియాలో పెద్ద ఎత్తున బయటపడింది. 172 మందికి సోకింది. వారిలో మూడొంతుల మంది 21- 40 ఏళ్ల వయసులోని పురుషులే. ఇది ఎక్కువగా యువతరానికే సోకుతుందని చెబుతున్నారు. ఈ వైరస్ మురుగు నీటిలో కనిపించిందని ధ్రువపడినప్పటికీ అది నీటి నుంచి సంక్రమించేది కాదని స్పష్టమయింది.

స్మాల్ పాక్స్ టీకా వల్ల మంకీ పాక్స్ తగ్గే అవకాశాలు 85 శాతం వరకు ఉన్నట్టు వెల్లడైంది. టెకోవిరిమాట్ (tecovirimat) అనే వ్యాక్సిన్‌ను బ్రిటన్ సిద్ధం చేసిందం టున్నారు. వైరస్ సోకిన వ్యక్తులను 21 రోజుల పాటు ఒంటరిగా ఐసొలేషన్‌లో ఉంచడం వల్లనే దీని వ్యాప్తిని అరికట్టవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అత్యవసర ఆరోగ్య సమస్యగా ప్రకటించింది. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో కనిపించడంతో అక్కడ కూడా ఆరోగ్య ఎమర్జెన్సీ విధించా రు. అమెరికాలో బయటపడిన కేసుల సంఖ్య 7102, న్యూయార్క్‌లో 1748 మందికి, కాలిఫోర్నియాలో 826 మందికి, జార్జియా, టెక్సస్, ఇల్లినోయిస్ వంటి ప్రతిచోట ఐదువందల మందికి పైబడి ఈ వ్యాధి సోకింది. భారత దేశంలో మంకీ పాక్స్ వ్యాప్తి నెమ్మదిగా ఉంది. మొన్న బుధవారం నాడు తొమ్మిదో కేసు బయటపడింది.

ఢిల్లీలో విదేశీ యాత్ర చరిత్ర లేని 31 ఏళ్ల పురుషునికి సోకింది. దీనితో దేశ రాజధానిలో నాలుగు కేసులను కనుగొన్నారు. దేశంలో మొట్టమొదటి కేసు జూలై 14న కేరళలో బయటపడింది. దుబాయ్ వెళ్లి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తిలో గత నెల 30న కనుగొన్నారు. కరోనా మూడో అల ఒమిక్రాన్ రెండో అల మాదిరిగా మృత్యు బీభత్సాన్ని సృష్టించకుండానే జారుకొన్నది. మంకీ పాక్స్ సైతం ఒక మాదిరిగా బాధపెట్టి తెర మరుగు అవుతుందని భావిస్తున్నారు.

అయితే వ్యక్తిగతంగా ప్రజలు, విధానపరంగా ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగని మితిమించిన ఆందోళన చెందనవసరం లేదు. లాక్ డౌన్‌ల వంటి చర్యలకు తొందరపడవలసిన పని లేదు. కరోనాకు రెండు విడతల టీకా తర్వాత బూస్టర్ డోస్ కూడా వేయించుకొంటున్నారు. మంకీ పాక్స్ వ్యాక్సిన్ ఇంకా గట్టిగా రూపొందలేదు. కరోనాగాని మంకీ పాక్స్‌గాని ఎందుకు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి ప్రబలుతున్నాయో మూలంలోని లోపం ఏమిటో శాస్త్ర పరిశోధనలు తేల్చి చెప్పాలి. వాటికి మరింత సమర్ధవంతమైన పరిష్కారం కనుగొని వీటి నుంచి శాశ్వత ఊరట పొందాలి. కరోనా మూడు దశలూ లక్షలాది మందిని బలిగొన్నాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలనూ ఠారెత్తించాయి. ఆర్థికంగా తీవ్ర స్థాయిలో నష్టపరిచా యి. అయినా దానిని కలిసికట్టుగా ఎదుర్కోడానికి ప్రపంచ దేశాలు తలలు ఒక్కచోట చేర్చలేదు. వ్యాక్సిన్ మాస్క్‌లు, శానిటైజర్లు, మందులు వగైరాల తయారీదార్లు విపరీతంగా వ్యాపారం చేసుకొన్నారు. పేద, పెద్ద అనే తేడా లేకుండా కరోనా పెట్టిన ఆర్ధిక బాధలు చెప్పనలవి కానివి. ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. 30, 40 లక్షలు పోసినా నయం కాక ఆత్మీయులను కోల్పోయినవారు లెక్కలేనంత మంది. పేద ప్రజలు, పేద దేశాల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే ఆరోగ్య వ్యూహం ప్రపంచానికి అందుబాటులో లేకపోడం శోచనీయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News