కోతులు గుళ్లూ, గోపురాల దగ్గర భక్తుల చేతుల్లోంచి అరటిపళ్లు, ఇతర తినుబండారాలు ఎత్తుకుపోవడం తెలిసిందే. వాటి చిలిపి చేష్టలకు సరదాగా నవ్వుకుంటూ ఉంటాం. కానీ, గుజరాత్ లోని సల్కి అనే గ్రామంలో కొన్ని కోతులు దారుణాలకు తెగబడుతున్నాయి. సల్కిలో కొన్నేళ్లుగా కోతుల బెడద ఎక్కువైంది. ఎన్నిసార్లు తరిమేసినా, మళ్లీ గ్రామానికి వచ్చి చేరుతున్నాయి. అడపాదడపా ఒంటరిగా వెళ్తున్నవారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. గత వారం రోజుల్లో నలుగురిని ఇలాగే తీవ్రంగా గాయపరిచాయి.
కాగా, మంగళవారంనాడు కోతులు మరీ బరితెగించి, పదేళ్ల బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్నేహితులతో కలసి ఆరుబయట ఆడుకుంటున్న దీపక్ ఠాకూర్ అనే బాలుడిపై కోతుల గుంపు దాడి చేసి, గాయపరిచింది. ఈ దాడిలో ఆ కుర్రాడి కడుపు లోపలి పేగులు బయటపడ్డాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అటవీశాఖాధికారులు రంగంలోకి దిగి, కోతులను తరిమివేసేందుకు చర్యలు చేపట్టారు.