కొవిడ్ రోగుల్లో కొన్ని గంటల్లోనే సత్ఫలితాలు
ఢిల్లీ గంగారామ్, బిఎల్‌కె మాక్స్ ఆస్పత్రుల డాక్టర్ల భరోసా
న్యూఢిల్లీ :ఇద్దరు కొవిడ్ రోగుల్లో మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీతో 12 గంటల్లోనే సత్ఫలితాలు వచ్చాయని ఢిల్లీ లోని గంగారామ్ ఆస్పత్రి డాక్టర్లు బుధవారం వెల్లడించారు. 36 ఏళ్ల హెల్త్‌కేర్ వర్కర్ తీవ్రమైన జ్వరం, దగ్గు, కండరాల నొప్పులు, , రక్తంలో తెల్లకణాలు తగ్గుదల (లుకోపేనియా) తదతర లక్షణాలతో గత ఆరు రోజులుగా బాధపడుతుండగా, మంగళవారం మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీతో చికిత్స చేయడమైందని, కేవలం ఎనిమిది గంటల్లోనే సత్ఫలితాలు లభించాయని డాక్టర్ పూజా ఖోస్లా చెప్పారు. గంగారామ్ ఆస్పత్రిలో మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్‌గా పూజా ఖోస్లా ఉన్నారు. ఈ లక్షణాలున్న రోగులు ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలకు చేరుకుంటారని చెప్పారు. ఇప్పుడీ కేసులో ఐదు రోజుల పాటు తీవ్రమైన జ్వరం వచ్చిందని, రక్తంలో తెల్లకణాల సంఖ్య 2600 కు పడిపోయిందని, యాంటీబాడీ థెరపీతో చికిత్స చేయగానే రోగి పరిస్థితి బాగా మెరుగైందని తెలిపారు.
మరో రోగి 80 ఏళ్ల ఆర్‌కె రాజ్‌దాన్. రాజ్‌దాన్ డయాబెటిస్, అత్యధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సిటి స్కాన్‌లో కొవిడ్ నెమ్మదిగా వ్యాపిస్తున్నట్టు తేలిందని, అయిదో రోజున ఆయనకు ఈ యాంటీబాడీ థెరపీ చేయగా, 12 గంటల్లోనే సత్ఫలితాలు కనిపించాయి. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీని సరిగ్గా వినియోగిస్తే అనుకున్న రీతిలో సత్ఫలితాలు వస్తాయని, కొవిడ్ రోగుల్లో ఈ థెరపీ చాలా కీలక పాత్ర వహిస్తుందని డాక్టర్ ఖోస్లా చెప్పారు. బిఎల్‌కె మాక్స్ ఆస్పత్రి డాక్టర్లు మంగళవారం వృద్దులైన ఇద్దరు కరోనా రోగులు గుండె సమస్యలతో బాధపడుతుండగా ఈ యాంటీబాడీ చికిత్స ఇవ్వడంతో వారం తరువాత వారిలో నెగిటివ్ కనిపించిందని తెలిపారు.
ఇదే విధంగా ఛాతీ, శ్వాస సమస్యలతో సతమతమౌతున్న ఇద్దరికి కొవిడ్ లక్షణాలు కనిపించిన మూడు రోజుల్లోనే యాంటీబాడీ కాక్‌టైల్ థెరపీ చికిత్స చేయగా వారిలో మెరుగైన ఫలితాలు వచ్చాయని బిఎల్‌కె మాక్స్ సెంటర్ ( ఛాతీ, శ్వాస కోశ సమస్యల విభాగం )సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ నాయర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌పై పోరులో మోనో క్లోనల్ యాంటీబాడీ కాక్‌టైల్ థెరపీ కీలక పాత్ర వహిస్తుందని నిర్ధారణ అయినట్టు డాక్టర్లు వివరించారు. మోనోక్లోనల్ యాంటీబాడీలంటే అసలైన యాంటీబాడీలను పోలి ఉండే యాంటీబాడీలు. ఇవి నిర్దిష్ట యాంటీజెన్‌ను లక్షంగా చేసుకుని పనిచేస్తాయి. ఈ విధమైన థెరపీ గతంలో ఎబోలా, హెచ్‌ఐవి వైద్యచికిత్సలో ఉపయోగించి సత్ఫలితాలు సాధించారు.