హైదరాబాద్: వాతావరణ పరిస్థితులను బట్టి నైరుతి రుతుపవానాలు జూన్ 4న కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను ఐఎండి వెల్లడించింది. జూన్ 1న రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తామని తాము భావించటం లేదని వివరించింది. ఈ సంవత్సరం వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. వచ్చే వారం రోజుల్లో అరేబియా సముద్రంలో తుపాను వచ్చే అవకాశాలు కూడా లేవని స్పష్టం చేసింది. ఉత్తరాదిన రుతుపవనాలకు ముందుగానే వర్షాలు పడటానికి పాశ్యాత్య దేశాల్లో వాతావరణ అసమతుల్యతే కారణం అని వెల్లడించింది.
పాశ్చాత్య దేశాల్లో అసమతుల్యత కారణంగానే భారత్‌లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని , అందువల్లనే ఢిల్లీతోపాటు పరిసర నగరాల్లో కొంత ఉపశమనం కలుగుతోంది. దేశం మొత్తం ఒకే తరహాలో వర్షపాతం నమోదైతే అనుకూల పరిస్థితులు ఉంటాయని తెలిపింది. వ్యవసాయంపై కూడా ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1నుండి ఏడు రోజుల వ్యవధిలో కేరళ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. గత మే 29న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. అప్పటి పరిస్థితుల ఆధారంగా రుతుపవనాలు మే 27నే ప్రవేశిస్తాయని అంచనా వేసింది. అయితే రెండు రోజుల ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి.
గత 18 సంవత్సరాలుగా రుతుపవనాల విషయంలో కచ్చితమైన అంచానా వేస్తున్నట్టు వాతావరణ శాఖ వివరించింది. 2015లో మాత్రం తమ లెక్క తప్పిందని పేర్కొంది. 2005 నుంచి కేరళకు రుతుపవనాల రాకను ముందస్తుగా అంచనా వేసిఆ వివరాలను వెల్లడిస్తూ వస్తున్నట్టు భారత వాతావరణ శాఖ పేర్కొంది.