న్యూఢిల్లీ : ఈసారి నైరుతి రుతుపవనం అత్యంత అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఆదివారం రోజు ఒకేసారి ఇటు వాణిజ్య రాజధాని ముంబై, అటు దేశ రాజధాని ఢిల్లీలో నైరుతి రుతుపవనాల ఆగమనంతో భారీ వర్షాలు పడ్డాయి. ఈ విధంగా నైరుతి ఒకేసారి ఈ రెండు నగరాల్లో ప్రవేశించడం 62 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. ఈ విధంగా ఈ తొలకరి ప్రత్యేకతను సంతరించుకుంది. 1961 జూన్ 21న ఇటువంటి పరిణామం ఇంతకు ముందు చోటుచేసుకుందని, ఆ తరువాత ఇప్పుడు 2025 జూన్ 25న ఏర్పడిందని వాతావరణ కార్యాలయం తెలిపింది.
అటు ముంబై ఇటు ఢిల్లీలను ఆదివారం ఆత్మీయ అతిధిగా వచ్చి తాకిన నైరుతి రుతుపవనం రెండింటిని భారీ వర్షాల కుమ్మరింతతో తడిపేసింది. వాతావరణ విభాగానికి సంబంధించి ఈ రెండు నగరాలలో ఏకకాల రుతుపవన ప్రవేశం కీలకమైన రికార్డుగా మారింది. రెండు నగరాలకు మధ్య 1430 కిలోమీటర్లకు పైగా దూరం ఉంది. రుతుపవనాలు ఏకకాలంలో రెండు చోట్ల తమ ప్రభావం చూపడం వాతావరణ శాస్త్రీయ విశ్లేషణల క్రమంలో అరుదైన ఘట్టం అయింది.
ముంబైకి సాధారణంగా రుతుపవనాలు జూన్ తొలివారంలోనే ప్రవేశిస్తాయి. భారీ వర్షాలు కురుస్తాయి. అయితే ఢిల్లీకి రుతుపవనాలు చేరుకోవడం సాధారణంగా జూన్ 27న జరుగుతుంది. ఈ క్రమంలో చూస్తే రెండు రోజుల ముందే ఢిల్లీ వానలతో చల్లబడింది. నిజానికి ముంబైకి రుతుపవనాలు ఎంత ఆలస్యంగా అయినా జూన్ 11 లోగానే అరుదెంచుతాయి.