రాయలసీమలోనే అగిన రుతుపవనాలు
తెలంగాణలో పెరిగిన వడగాలులు
మనతెలగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయల సీమ వరకూ వచ్చి ఆక్కడే ఆగిపోయాయి. అరేబియా సముద్రం నుంచి కేరళ రాష్ట్రంలోకి వారం రోజుల కిందటే ప్రవేశించిన రుతుపవనాలు ఈనెల 11న ఏపిలోకి ప్రవేశించి అక్కడే నిలిచిపోయాయి. ఏపిలో శ్రీహరి కోట, కర్ణాటక రాష్ట్రంలోని రత్నగిరి ప్రాంతాల్లో నిలిచిపోయిన రుతుపవనాలు అక్కడి నుంచి ముందుకు కదలటం లేదు. ఇప్పటికే దేశంలోని సగానికిపైగా ప్రాంతాల్లో విస్తరించాల్సివున్నప్పటికీ వీటిగమనం మందగించింది. భారత వాతావరణ శాఖ ముందస్తు అంచనాల మేరకు ఈ నెల 15నాటికి నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాల్సివుంది.
అయితే 24గంటలు గడిచినా వీటి జాడా ఏమాత్రం కనిపించటం లేదు. బిపోర్‌జాయ్ తుపాను ప్రభావం రుతుపనాలపైన పడింది. తుపాను లేకుండా ఉంటే ఈ పాటికి నైరుతి రుతుపవాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి వుండేవని, బిపోర్‌జాయ్ ప్రభావంతో రుతుపనాల గమనం మందగించిందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. బిపోర్ జాయ్ తుపాను కారణంగా నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం కొంత బలహీన పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెల 19నాటికి ఇవి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర , రాయలసీమ ప్రాంతాల్లోనే నైరుతి రుతుపవనాలు కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. రుతుపవనాల రాక ఆలస్యం అవటం వల్ల రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వీస్తున్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది. రాష్ట్రంలో తీవ్రమైన వడగాలులు ఉంటాయని వెల్లడించింది.
కొమరంభీం, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ, వాయివ్య దిశలనుండి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల 24గంటలు అక్కడక్కడా తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో 45.3డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.యానంబైలులో 45.2,జంబుగలో 45, దామరచర్లలో 44.8, మహదేవపూర్‌లో 44.7, తోగర్రిలో 44.6, అలంగపురంలో 44.5, కొమ్ములవంచలో 44.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.