రాష్ట్రంలో నాలుగురోజులు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. నైరుతి రుతుపవనాలు ఉత్తర తెలంగాణ జిల్లాలనుంచి నిజామాబాద్ వరకూ విస్తరించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరమంతటా మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. నైరుతి గాలుల విస్తరణతో తెలంగాణలో అదివారం నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు , మెరుపులతో గంటకు 40కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా.. అత్యవసర సమయాల్లో 040-21111111, 9001136675 నంబర్లకు ఫోన్ చేయాలని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది.