Monday, December 23, 2024

చేతులు కలిస్తే చప్పట్లు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలు లేవనెత్తే కీలక అంశాలపై చర్చకు పార్లమెంట్‌లో ప్రభుత్వం అవకాశం ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని, పార్లమెంట్ సెషన్ సజావుగా సాగాలని అధికార పక్షం కోరుకుంటే , ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. మణిపూర్ పరిస్థితిపై వర్షాకాల సమావేశాలలో చర్చకు పార్టీ డిమాండ్ చేసింది. గురువారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభమయ్యే దశలో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. మణిపూర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

సంబంధిత విషయంపై చర్చకు తాము వాయిదా తీర్మానం తీసుకురాదల్చామని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి భేటీ తరువాత విలేకరులకు తెలిపారు. తాను బుధవారం జరిగిన బిఎసి భేటీకి హాజరయినట్లు , చర్చకు చేపట్టితీరాల్సిన విషయాల గురించి ప్రస్తావించినట్లు చెప్పారు. తరువాత అఖిలపక్ష సమావేశంలోనూ తాము మణిపూర్‌పై చర్చ జరగాలని డిమాండ్ చేసినట్లు వివరించారు. రెండు నెలలు గడిచినా ఇప్పటికీ ప్రధాని మోడీ మణిపూర్ విషయంపై మౌనంగా ఉన్నారని, ఇప్పటికైనా ఆయన పార్లమెంట్ వేదికగా దీనిపై ప్రకటన చేస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. మణిపూర్‌పై చర్చ ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్ అన్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాలలో వరదలు, బాలాసోర్‌లో రైలు దుర్ఘటన , ధరల పెరుగుదల, సమాఖ్యవాదంపై దాడుల క్రమం వంటి వాటిపై చర్చకు తమ పార్టీ పట్టు పట్టిందని వివరించారు. చైనా సరిహద్దుల్లో పరిస్థితి, వాణిజ్య అసమానతలపై కూడా చర్చకు కోరినట్లు తెలిపారు. కాగా మణిపూర్ పరిస్థితితో పాటు ప్రతి అంశంపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. బిఎసి తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈసారి సెషన్‌లో 32 లెజిస్లేటివ్ విషయాలు ప్రస్తావనకు వస్తాయన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన బిఎసిలో ప్రతిపక్షాలు మణిపూర్ విషయాన్ని ప్రస్తావించాయి. అక్కడి హింసాకాండ గురించి ఇతరత్రా అంశాల గురించి ప్రతిపక్షాలు కోరినట్లు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News