Monday, December 23, 2024

24 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్నాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వారం రోజుల పాటు జరగనున్నాయి. ఈనెల 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయింపులు బట్టి కాంగ్రెస్ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నది. ఈనెల 25 లేదా 26న ప్రభుత్వం రాష్ట్ర పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. రైతు భరోసా,రైతు రుణమాఫీ అంశాలపై సమావేశాల్లో ఉండనున్న వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉన్నది.

కొత్త ఆర్‌ఒఆర్ చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై చర్చ ఈ సమావేశాలలో చర్చించనున్నారు. ఈ సమావేశాలలో రేవంత్ సర్కార్ పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టనున్నది. 6 గ్యారెంటీల అమలు,నిరుద్యోగుల ఆందోళన, లా అండ్ ఆర్డర్ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే అవకాశం ఉంది.ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖాధికారులతో సమీక్షంచారు.

ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి జితేందర్, అదనపు డిజి మహేశ్‌కుమార్ భగవత్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఛీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బీ అధికారులు, ట్రాఫిక్ అధికారులు, జిఎడి అధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. సమావేశ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, రామ చందర్ నాయక్ కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో ఆర్థిక శాఖ అధికారులతో కూడా స్పీకర్ చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండటంతో అందుకు తగినట్లుగా అధికారులు సిద్ధం కావాలని సూచించినట్లు సమాచారం.

పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచన
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి, లేజిస్లేచర్ సెక్రటేరియట్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. ఇప్పుడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం వలన సమావేశాలు నిర్వహించే నాటికి పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉంటుందని వివరించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా, అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

గ్రామీణ ప్రాంతాలకు, సుదూర ప్రాంతాల పర్యటనలకు వెళ్లినప్పుడు తగిన భద్రత, బందోబస్తు కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లేటప్పుడు ఎయిర్ పోర్టులలో కూడా తగిన ప్రొటోకాల్ పాటించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా.నరసింహా చార్యులు, విప్ రామచంద్రు నాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News