వర్షాకాల పార్లమెంట్ సెషన్ హోరుగా ఆరంభం
అగ్నిపథ్, ధరలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు
రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కు సభల వాయిదా
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం తుపాన్ తాకిడి తరహాలో వేడిగా ఆరంభమయ్యాయి. ధరల పెరుగుదల మొదలుకుని అగ్నిపథ్ వరకూ పలు కీలక అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. అజెండాలో వీటిని చేర్చాల్సిందేనని డిమాండ్ చేశాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సభ ఆరంభం అయిన తరువాత ప్రతిపక్ష సభ్యులు కొన్ని అంశాలను ప్రస్తావించేందుకు యత్నించారు. అయితే ఈ దశలోనే లోక్‌సభలో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు, సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో ఓటింగ్ వెళ్లేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలో సభాధ్యక్షులు వెంకయ్యనాయుడు సభారంభం దశలో ముందుగా సంతాప ప్రస్తావనల ప్రకటన చదివి విన్పించారు. ఈ దశలోనే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి, నినాదాలకు దిగారు. కీలక విషయాలపై చర్చకు పట్టుపట్టారు. అయితే కొందరికి సభ సజావుగా సాగడం ఇష్టం లేనట్లుగా ఉందని, వారి వైఖరి ఈ విధంగా ఉందని పేర్కొన్న వెంకయ్యనాయుడు ఇక సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో ఓటింగ్ వెళ్లేందుకు వీలు కల్పిస్తూ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల ఎన్నికైన ముగ్గురు లోక్‌సభ కొత్త సభ్యులుగా ప్రమాణం చేశారు. వీరిలో నటుడు శతృఘ్నసిన్హా టిఎంసి సభ్యులుగా , దినేష్‌లాల్ యాదవ్ నిరాహూ , ఘన్‌శ్యామ్ సింగ్ లోధీ బిజెపి సభ్యులుగా స్పీకర్ ఓంబిర్లా ప్రమాణం చేయించారు. లోక్‌సభకు ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతర ప్రముఖులు హాజరయ్యి ఆ తరువాత సభలో రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కు స్పీకర్ సమయం ఇవ్వడంతో ఇతర సభ్యులతో పాటు వెళ్లారు. ప్రతిపక్ష సభ్యులు కీలక అంశాలపై చర్చకు పట్టుపడుతూ నినాదాలకు దిగుతూ ఉండటంతో స్పీకర్ కలుగచేసుకుని దేశంలో ఎన్నికలను అంతా ప్రజాస్వామిక పండుగగా నిర్వహించుకుంటారని, దేశ రాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నందున మనమంతా వెళ్లి ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉందని పిలుపు నిచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలవరకూ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు సభ తిరిగి సమావేశం అయింది.
వెంటనే వామపక్ష సభ్యులు ప్లకార్డులతో వెల్‌లోకి వచ్చారు. దేశంలో ద్రవ్యోల్బణం ఇతర అంశాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుపట్టారు. కాంగ్రెస్ సభా పక్ష నాయకులు అధీర్ రంజన్ చౌదరి లేచి కొన్ని అంశాలను ప్రస్తావించేందుకు యత్నించారు. అగ్నిపథ్ వంటి కీలక అంశాలను ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు పట్టుపడుతున్నప్పుడే ఓటింగ్ పేరిట స్పీకర్ సభను వాయిదా వేశారని చౌదరి విమర్శించారు. ఈ దశలో సభాధ్యక్ష స్థానంలోబిజెపి సభ్యులు రాజేంద్ర అగర్వాల్ ఉన్నారు. సభలో పార్లమెంటరీ పత్రాల సమర్పణకు అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజూ ఈ దశలో కుటుంబ న్యాయస్థానాల (సవరణల) బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అయితే ప్రతిపక్షాలు దేశంలో ధరల పెరుగుదల , కీలకమైన అగ్నిపథ్ స్కీంపై చర్చకు పట్టుపడుతూ నినాదాలు, నిరసనలకు దిగుతూ ఉండటంతో గందరగోళం చెలరేగింది. దీనితో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకు ముందు స్పీకర్ సభలో సంతాప ప్రకటనలు చదివి విన్పించారు.