న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి అమలుపై వివాదం, మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ, ఢిల్లీ ఆర్డినెన్సు, ప్రతిపోఆల ఐక్యతా యత్నాల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి.
జులై 20న ప్రారంభమై ఆగస్టు 11వ తేదీతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. వర్షాకాల సమావేశాల తేదీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ప్రకటించారు. సమావేశాల సందర్భంగా సభ్యులందరూ ఫలప్రదమైన చర్చల కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మధ్యప్రదేశ్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి) అంశాన్ని తెరమీదకు తెచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేనప్పటికీ ఈ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కాగా.వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోటీచేయడంపైచర్చించేందుకు పాట్నాలో మొదటిసారి సమావేశం జరుగగా రెండవ సమావేశం జులై మధ్యలో బెంగళూరులో జరగనున్నది. ప్రతిపక్షాల ఐక్యత వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో ప్రతిఫలించిన పక్షంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే యత్నాలు జరిగే అవకాశం ఉంది.
ఢిల్లీ ప్రభుత్వ అధికార యంత్రాంగపై పట్టు కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్సును ఈ సమావేశాలలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభలో ఈ ఆర్డినెన్సు ఆమోదం పొందే అవకాశం ఉన్నప్పటికీ తగిన బలం లేని కారణంగా రాజ్యసభలో ఈ బిల్లును ప్రతిపక్షాలు గట్టిగా ప్రతిఘటించే అవకాశం ఉంది.