Friday, November 22, 2024

పార్లమెంటు మళ్లీ వాయిదా

- Advertisement -
- Advertisement -
Monsoon Session Of Parliament Updates
విపక్షాల గొడవతో ఉభయ సభల్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం
లోక్‌సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం ఎడతెగకుండా కొనసాగుతోంది. పెగాసస్ వ్యవహారం, వివాదాస్పద సాగు చట్టాలపై విపక్షాల ఆందోళన కారణంగా గురువారం కూడా ఉభయ సభలు పదేపదే వాయిదా పడిన తర్వాత శుక్రవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ పలు దఫాల వాయిదా తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరిగి సమావేశమయ్యాక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెట్రోస్పెక్టివ్ పన్ను రద్దుకు సంబంధించి పన్ను చట్టాల సవరణకు బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును ప్రవేశపెడానికి మంత్రి లేవగానే కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి లేచి ఎలాంటి చర్చా లేకుండానే బిల్లులను సగటున ఏడునిమిషాలకొకటి చొప్పున ఆమోదించడం జరుగుతోందని అన్నారు. చివరి క్షణంలో సభాకార్యకలాపాలకు సంబంధించిన అనుబంధాలను తీసుకు రావడం సరికాదని అన్నారు. ఆర్‌ఎస్‌పి సభ్యుడు ఎన్‌కె ప్రేంచంద్రన్ కూడా అధిర్ రంజన్ వాదనను సమర్థించారు. ఆ తర్వాత ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య మూజువాణి ఓటుతో బిల్లును సభలో ప్రవేశపెట్టారు. తర్వాత స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు.

రాజ్యసభ కూడా అంతే..

రాజ్య సభ కూడా గురువారం పలుమార్లు వాయిదా పడ్డ తర్వాత చివరగా సాయంత్రం 3.40 గంటలకు సమావేశమయింది. అత్యవసర రక్షణ సర్వీసుల బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించాక డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ బిల్లును లోక్‌సభ ఈ నెల 3న ఆమోదించింది. విపక్షాల నినాదాల మధ్యనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిల్లును ప్రవేశపెట్టారు. అంతకు ముందు భోజన విరామానికి ముందు మూడు సార్లు, తర్వాత ఒక సారి మొత్తం నాలుగు సార్లు సభ వాయిదా పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News