Monday, December 23, 2024

నేటి నుంచి పార్లమెంట్

- Advertisement -
- Advertisement -

అస్త్ర శస్త్రాలతో అధికార, విపక్షాలు సిద్ధం
అఖిలపక్ష భేటీకి ప్రధాని గైర్హాజరు ఇది
అన్‌పార్లమెంటరీ కాదా?: ప్రశ్నించిన విపక్షాలు
32 బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
తెలంగాణకు గిరిజన వర్శిటీ
బిల్లు ప్రవేశపెట్టే అవకాశం

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. సోమవారంనుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ నేతృత్వంలో ఏర్పాటయిన ఈ సమావేశానికి ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్ పాల్గొనగా, విపక్షాల తరఫున ఆయా పార్టీల నేతలు హాజరయ్యారు. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాల అజెండాను ముందుంచి అన్ని పార్టీల్లో ఏకాభిప్రాయాన్ని తెచ్చే ప్రయత్నంలో భాగంగా అఖిలపక్ష భేటీని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రహ్లాద్ జోషీ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సమావేశానికి ప్రధాని మోడీ ఎప్పటిలాగే గైరుహాజరవడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.‘అఖిలపక్ష సమావేశానికి ఎప్పటిలాగే ప్రధాని గైరుహాజరయ్యారు.

ఇది అన్‌పార్లమెంటరీ కాదా?’ అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు. సమావేశానికి కాంగ్రెస్ తరఫున మల్లికార్జున ఖర్గే, జై రాం రమేశ్ హాజరు కాగా డిఎంకె తరఫున టిఆర్ బాలు, తిరుచ్చి శివ, టిఎంసి తరఫున సుదీప్ బందోపాధ్యాయ్, ఎన్‌సిపి తరఫున శరద్ పవార్ హాజరయ్యారు. బిజెడినుంచి పినాకి మిశ్రా టిఆర్‌ఎస్ తరఫున కె కేశవరావు, నామా నాగేశ్వర రావు, వైసిపి నుంచి విజయసాయి రెడ్డి, వైఎస్ మిథున్ రెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.ఆర్‌జెడినుంచి ఎడి సింగ్, శివసేననుంచి సంజయ్ రౌత్‌లు పాల్గొన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, అగ్నిపథ్ వంటి అంశాలపై ప్రధానంగా సమావేశాల్లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు ప్రధానంగా పట్టుబట్టినట్లు సమాచారం.

32 బిల్లులు తీసుకువచ్చే అవకాశం

ఇదిలా ఉంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తుండగా, వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం కూడా సిద్ధమవుతోంది. ఈ సమావేశాల్లో మొత్తం 32 బిల్లులను తీసుకురావడానికి కేంద్రం సిద్ధమయింది. వీటిలో 24 బిల్లులు కాగా, మరో 8 బిల్లులు ఇప్పటికే ఉభయ సభల ముందుకు వచ్చాయి.కొత్తగా ప్రవేశపెట్టే వాటిలో తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం, గతిశక్తి వర్సిటీ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న సెజ్‌ల స్థానంలో డెవలప్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ అండ్ సర్వీసెస్ హబ్స్(దేశ్) ఏర్పాటుకు సంబంధించిన బిల్లులున్నాయి. వివాదాస్పద అటవీ సంరక్షణ బిల్లును కూడా ఈ సమావేశంలోనే ప్రవేశపెట్టనున్నారు. అయితే రాష్ట్రపతి ఎన్నిక కారణంగా తొలి రోజు సమావేశం పెద్దగా జరక్క పోవచ్చని తెలుస్తోంది. 22న ఓట్ల లెక్కింపు, 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నందున అప్పటివరకు సమావేశాలు పూర్తిస్థాయిలో జరక్కపోవచ్చని భావిస్తున్నారు. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News