జులై నెలలో సాధారణ వర్షాలు: ఐఎండి
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు మామూలు తేదీకన్నా ఆరు రోజులు ముందుగానే దేశమంతా విస్తరించాయి. శుక్రవారం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సీజన్‌లో తొలి సారి వర్షాలు కురవడంతో దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణపూర్తయినట్లయింది. రుతుపవనాలు ఈ ఏడాది మామూలు తేదీ అయిన జూన్ 1కి మూడు రోజుల ముందే కేరళను తాకిన విషయం తెలిసిందే. మామూలు తేదీకన్నా ఆరు రోజులు ముందుగానే శనివారం రుతుపవనాలు దేశమంతటికీ విస్తరించాయని భారత వాతావరణ విభాగం( ఐఎండి) తెలియజేసింది. ఇప్పటివరకు రుతుపవన వర్షాలు కురవని పశ్చిమ రాజస్థాన్, ఉత్తర గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తొలిసారి వర్షాలు కురిసాయి. అయితే శనివారం నాటికి దేశం మొత్తంమీద అయిదు శాతం వర్షపాతం లోటు ఉండడం గమనార్హం.
రాజస్థాన్ మినహా రుతుపవనాల కోర్ జోన్‌లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకు లోటు వర్షాలు కురిశాయని ఐఎండి తెలియజేసింది. రుతుపవనాల కోర్ జోన్‌లో గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలున్నాయి. ఇవి ప్రధాననంగా వర్షాధార వ్యవసాయప్రాంతాలు. కాగా జులై మొత్తంలో వర్షపాతం దాదాపుగా సాధారణ స్థితిలో అంటే ఆ నెల సగటు( ఎల్‌పిఎ)లో 94 శాతంనుంచి 106 శాతం మధ్య ఉండవచ్చని ఐఎండి జులై నెలకు విడుదల చేసిన అంచనాలో తెలిపింది. 1971నుంచి 2020దాకా సేకరించిన డేటా ఆధారంగా జులై నెల సగటు వర్షపాతం 280.4 మిల్లీమీటర్లుగా ఉంది. బంగ్లాదేశ్‌పై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అలాగే ఉత్తర ఒడిశా ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడే సంకేతాలు ఉన్నాయని, ఈ రెండింటి కారణంగా ఈ ప్రాంతంలోను, మధ్యభ్రారత్‌లోను వర్షపాతం పెరిగే అవకాశాలున్నాయని ఐఎండి తెలిపింది.