Wednesday, January 22, 2025

ఎదురుచూపులే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నైరుతి రుతుపవనాల కదలికలు మందగించాయి. భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు ఈ నెల 10 న రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకాల్సివుండగా , ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల వీటి రాక మరింత ఆలస్యం అవువుతోంది. ఈ నెల 15నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న రెండు రోజుల కిందటి ఐఎండి అంచనాలు కూడా తప్పాయి. తాజా అంచనాల మేరకు రుతుపవనాల రాక మరో నాలుగు రోజలు ఆలస్యం కానుంది. బిపోర్ జాయ్ తుపాను ప్రభావం రుతుపవనాల కదలికను మందగింపచేసింది. దీంతో వీటిరాక మరింత జాప్యం అవుతోంది. బిపోర్ జాయ్ తుపాను గురువారం నాడు తీరం దాటింది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ,కచ్ ప్రాంతాల్లో ఇది తీరాన్ని దాటింది. దీంతో రుతువనాల కదలికకు ఇక వాతావరణం అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ నెల 19నాటికి నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. రాష్ట్రంలో అప్పటి దాక ఎండలు దంచికొట్టనున్నాయి. రాగల మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయిన వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్ , ఖమ్మం, ములుగు, కొమరంభీం, మంచిర్యాల , నిర్మల్ , నిజామాబాద్ , పెద్దపల్లి, కరీంనగర్ , నల్గొండ, కొత్తగూడెం, సూర్యాపేట , భూపాలపల్లి, మహబూబాబాద్ , వరంగల్ , హన్మకొండ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది. గురువారం సూర్యపేట జిల్లా అలంగాపురంలో అత్యధికంగా 44.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరం భీం జిల్లా జంబుగలో కూడా 44.2డిగ్రీలు నమోదయ్యాయి.
అక్కడక్కడా తేలికపాటి వర్షాలు:
దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ ,వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రంవైపు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. కాగా గురువారం నిజామాబాద్ జిల్లా మోసర, కొమరంభీమం జిల్లా అసిఫాబాద్ లో 2.3 మి.మి చొప్పున వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News