Sunday, December 22, 2024

రుతురాగం

- Advertisement -
- Advertisement -

భానుడి భగభగలతో దేశమంతా అగ్నిగోళంలా మండుతున్న వేళ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వ్యవసాయరంగానికి చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు గురువారం నాడు కేరళను తాకినట్లు ప్రకటించింది. ఇవి వేగంగా కదులుతూ ఈశాన్య రాష్ట్రాల వైపు విస్తరించినట్లు వెల్లడించింది. మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశమున్నట్లు పేర్కొంది. ఏపిలోని రాయలసీమ మీదుగా జూన్ ఐదవ తేదినాటికి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్టు అంచనా వేసింది. అయితే దాని కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాలను తాకడానికి రెమాల్ తుపాను కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణ పరిస్థితులకంటే ఒక రోజు ముందుగానే మే 31 నాటికి కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ అంచనా వేయగా, ఐంఎండి అంచనాలకంటే మరింత వేగంగా ఒక రోజు ముందుగానే ఇవి ప్రవేశించాయి. లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం ఆగస్టు-సెప్టెంబరు నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

దీని వల్ల ఈ రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో అంచనా వేసింది. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్‌నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాల కదలిక ఉందని వివరించింది .ఇదిలా ఉండగా, మన దేశంలో 52శాతం నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారంగా ఉంది. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి 40శాతం దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. నైరుతి రుతుపవనాలు ముందుగా కేరళను తాకిన సందర్బాలు అరుదుగానే ఉన్నాయి. భారత వాతవరణ శాఖ గణంకాల ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. మొదటిసారి ముందుగా 1918లో మే 11నే ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకాయి.

రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు!
జూన్ ఒకటిన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ వాయువ్య దిశలనుండి వీస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ,ఉరుములు , మెరుపులు , గంటకు 40కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం నాడు రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఏటూరు నాగారంలో 5.5 ,కొస్గిలో 3, మొగుల్లపల్లిలో 2.5 మిల్లీమీటర్ల చొప్పున తుంపర్లు పడ్డాయి. మరో వైపు పటగి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్మాయి. రాష్ట్రంలో గరిష్టంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 46.4డిగ్రీలు ,నీల్వాయ్‌లో 46, బెలపల్లిలో 45.8 డిగ్రీలు,హాజీపూర్‌లో 45.5, నెన్నెల్‌లో 45.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 45.8 , కొమరంభీమ్ జిల్లా కాగజ్ నగర్‌లో 45.7, కుంటాలలో 45.3,ఆసిపాబాద్‌లో 45.4,పెద్దపల్లి జిల్లా సుగులంపల్లిలో 45.4డిగ్రల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News