ఛండీగఢ్: హర్యానాలోని భివానీలో సంచలనం సృష్టించిన ఇద్దరు వ్యక్తుల సజీవదహనం సంఘటనలో నిందితుడైన గో సంరక్షకుడు మోనూ మానేసర్‌ను రాష్ట్ర పోలీస్‌లు మంగళవారం అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు మైనారిటీ కమ్యూనిటీ వ్యక్తులను గత ఫిబ్రవరిలో కారుతో సజీవదహనం చేసిన ఘటన భివానీలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడైన మోనూ మానేసర్‌ను ఒక మార్కెట్ ప్రాంతంలో పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. అతడ్ని రాజస్థాన్ పోలీస్‌లకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల సజీవ దహనం కేసులో మానేసర్ ప్రమేయం నేరుగా లేనప్పటికీ, ఆ ఘటనను ప్రోత్సహించడం కానీ, కుట్ర పన్నడం కానీ చేశారా అనే విషయంపై తాము విచారణ జరుపుతున్నట్టు రాజస్థాన్ పోలీస్‌లు గత నెలలో తెలిపారు.
హర్యానాలోని భివానీలో ఫిబ్రవరి 16న ఒక వాహనంలో ఇద్దరు సజీవదహనమైనట్టు కనుగొన్నారు. మృతులను రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నాసిర్(25), జునైడ్ అలియాస్ జునా(35)గా గుర్తించారు. ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు అనుమానిస్తూ 21 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ ఇద్దరినీ భజరంగ్‌దళ్ సభ్యులే కిడ్నాప్ చేసి కారుతో సహా సజీవదహనం చేసినట్టు మృతుల కుటుంబీకులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భజరంగ్‌దళ్ తోసిపుచ్చింది. సజీవదహనమైన ఇద్దరు వ్యక్తులు, వారి వాహనంపై రక్తపు మరకలు ఒకటేనని ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరించింది. దీనిపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ చర్యలకు ఆదేశించారు.