Monday, December 23, 2024

భూమిని చల్లార్చడానికి చంద్రుని ధూళి

- Advertisement -
- Advertisement -

అత్యధిక వేడితో భూమి భగభగమంటోంది. ఈ తాపాన్ని ఎంతవేగంగా తగ్గిస్తే మానవాళికి అంతమేలు. పారిశ్రామిక యుగం కన్నా ముందటి స్థాయిలో ఉష్ణోగ్రతలను తగ్గించడం అవసరం. అంటే 1.5 డిగ్రీల కన్నా మరి పెరగకుండా నివారించగలగాలి. అయితే భూతాపాన్ని తగ్గించడానికి సహాయపడే విపరీతమైన మార్గాన్ని పరిశోధకులు రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై ఉన్న ధూళిని సేకరించి అంతరిక్షంలో ప్రయోగించి భూమికి నీడ కల్పించాలన్నది కొత్త ప్రయత్నం. అయితే ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుందో పరిశీలించడానికి కంప్యూటర్ నమూనాలను రూపొందించారు.

చంద్రుని ఉపరితలంపై నుంచి భారీ మొత్తంలో ధూళిని సేకరించి తెచ్చి అంతరిక్షంలో ప్రయోగిస్తారు. అంతరిక్షంలో ఎక్కడైతే భూమి, సూర్యుడు గ్రహాలు తమ గురుత్వాకర్షణ శక్తిని పరస్పరం రద్దు చేసుకుంటాయో అలాంటి ఐదు లాగ్‌రేంజి పాయింట్ (lagrange point ) ల్లో మొదటి లాగ్‌రేంజ్ పాయింట్‌లో ధూళిని ప్రయోగిస్తారు. లాగ్‌రేంజ్ పాయింట్ అంటే అంతరిక్షంలో ఒక స్థానం. అక్కడ రెండు గ్రహాల ఉమ్మడి గురుత్వాకర్షణ శక్తులు కేంద్రం ( centifugal ) నుంచి సమాన దూరంలో ఉంటాయి. ఆ స్థానంలో చంద్రుని ధూళి మబ్బు వంటివి తప్పనిసరిగా స్థిరంగా ఉంటాయి. ఈ ధూళి కణాలు సూర్యుని వెలుగులో దాదాపు 1.8 శాతం వరకు నిరోధించగలుగుతాయి. 1.8 శాతం అంటే ఏడాదిలో ఆరు రోజుల సూర్యుని వెలుగుతో సమానం. కానీ ఇలా చేయడానికి ఏటా 10 బిలియన్ కిలోగ్రాముల ధూళి అవసరం అవుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

అంతరిక్షం నుంచి సూర్యుడి వెలుగును నిరోధించడం ఇప్పటికిప్పుడే అంత సాధ్యమయ్యే పనికాదు. ఆర్థికంగా, సాంకేతికంగా, రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ విధమైన వాతావరణ పరిష్కారాలు అవసరమని కొందరు అంటున్నారు. సూర్య కిరణాల బారి నుంచి భూమికి నీడ కల్పించి వేడి చల్లార్చాలన్న ప్రతిపాదనలు కొన్నేళ్లుగా ముందుకు వస్తున్నాయి. భూమి నుంచి ధూళిని తీసుకెళ్లడం కన్నా చంద్రుని ఉపరితలం ధూళిని తీసుకువచ్చి అంతరిక్షంలో ప్రయోగించడం చాలా సులువని యూనివర్శిటీ ఆఫ్ యుటా పరిశోధకులు బెంజమిన్ బ్రోమ్లీ పేర్కొన్నారు. ఎందుకంటే చంద్రునికి బలహీనమైన గురుత్వాకర్షణ శక్తి ఉండడమేనని ఉదహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News