Friday, December 20, 2024

కుదించుకుపోతున్న చంద్రుడు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : చంద్రుడు తన పరిమాణంలో కుదించుకుపోతున్నాడు. ఈ కుదింపును ముడతలు పడుతున్న ద్రాక్షపండుతో శాస్త్రవేత్తలు పోల్చారు. నేషనల్ ఎయిరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) నిర్వహించిన నూతన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గత వందల మిలియన్ సంవత్సరాలుగా ఇది జరుగుతోంది. ఫలితంగా ఊహించని ప్రకంపనలు సంభవిస్తున్నాయి. జనవరి 25న ది ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో చంద్రుని కేంద్ర భాగం క్రమంగా చల్లారిపోతుండడంతో చంద్రుడు తన చుట్టుకొలతలో 150 అడుగుల వరకు కుదించుకుపోయాడని వెల్లడైంది.

ఈ కుదింపు కొనసాగుతున్నందున చంద్రునిపై ప్రకంపనలకు దారి తీస్తోంది. నాసాకు చెందిన శాస్త్రవేత్తల బృందం, ఆరిజోనా స్టేట్ యూనివర్శిటీ, మేరీల్యాండ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సమష్టిగా ఈ అధ్యయనం సాగించారు. అంతేకాదు ఈ కుదించుకుపోతుండడం కొనసాగుతున్నందున చంద్రుని దక్షిణ ధ్రువం చుట్టూ ఉన్న ఉపరితలం ఆకారంలో మార్పు వస్తోందని బయటపడింది.

చంద్రుని దక్షిణ ధ్రువం వద్దనే ఆర్టెమిస్ 3 మిషన్ వ్యోమగాములను చేర్చడానికి నాసా ప్రణాళికలు చేస్తుండడం గమనార్హం. ఈలోగా చంద్రునిపై ఏర్పడిన ప్రకంపనలను వందమైళ్ల లోతు వరకు కొలవడం జరిగింది. కానీ మన భూకంపాలు కొన్ని నిమిషాలే ఉంటుండగా, దీనికి భిన్నంగా చంద్రునిపై ప్రకంపనలు మాత్రం కొన్ని గంటల వరకు , ఒక పూట వరకు ఉంటుండడం విశేషం. ఇవి అత్యంత ప్రభావం చూపిస్తుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News