అత్యంత అరుదైన గ్రహణపు వేళ
లండన్ : ఈ ఏడాది తొలి అత్యంత అసాధారణ చంద్రగ్రహణం ఆకాశంలో కనువిందు చేసింది. ఈస్టర్న్ స్టాండర్డ్ టైం (ఇఎస్‌టి ) ప్రకారం శనివారం రాత్రి 10.27 గంటలకు చంద్ర గ్రహణం ఆరంభమై రాత్రి 12.53 వరకూ ఉంటుంది. ఇక భారత కాలమానం (ఐఎస్‌టి) మేరకు ఈ చంద్రగ్రహణం ఉదయం 7.57 నుంచి 10.15 వరకూ ఉంటుంది. ఈసారి చంద్ర గ్రహణానికి ముందు చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారుతాడు, నెత్తుటి మరకలు అంటినట్లుగా రుధిర పుష్ఫంగా కన్పిస్తాడని ఖగోళ పరిశీలకులు తెలిపారు.
ఈ రుధిర చంద్ర గ్రహణం ప్రధానంగా అమెరికా, ఆసియా, న్యూజిలాండ్, మిడిలిస్టు , అంటార్కిటికా, యూరప్ దేశాలలో కన్పిస్తుంది. అయితే పూర్తిస్థాయి రుధిర చంద్రుడు భారతదేశంలో కనబడడు. ఈ అరుదైన చంద్రుడిని చూసే అవకాశం కేవలం దక్షిణ అమెరికా, యూరప్, మిడిలిస్టు దేశాలలోనే ఉంటుంది. అయితే భారతదేశంలోని వారు ఖగోళ వింతల పట్ల ఆసక్తి ఉన్నవారు రుధిర చంద్రుడితో కూడిన గ్రహణ దశలను నాసా వెబ్‌సైట్ లింక్ ద్వారా ఎప్పుడైనా తిలకించేందుకు వీలుంది. ఖగోళ పరిశోధనలలో అత్యంత కీలకం, ప్రత్యేకించి చంద్ర మండలపు అంతర్గత పరిణామాలపై పరిశోధనల రికార్డు కోసం నాసా ఈ గ్రహణాన్ని రికార్డు చేసి తరువాత వీక్షణకు ఏర్పాట్లు చేసింది. ఇది పూర్తిగా అమెరికాలోనే ఎక్కువ సేపు కన్పించే గ్రహణం అందులోనూ ఎరుపు రంగు చంద్రుడు ప్రత్యేకం అని, అమెరికన్లకు స్ఫెషల్ అని నాసా శాస్త్రజ్ఞులు తెలిపారు.