Sunday, December 22, 2024

మస్తక మహోత్సవం!

- Advertisement -
- Advertisement -

‘Today a reader, tomorrow a leader’ Margaret fuller
చదువు లేనివాడు వింత పశువు, చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక లేకయున్న ఆ చదువు నిరర్థకంబు…ఈ రెండు అనుభవ ఫలాలూ చదువనే ఒకే చర్యకు గల రెండు పార్శాలను విశదపరుస్తున్నాయి. చదవాలి, మంచి చదువును అలవరుచుకోవాలి, దానిలోని మంచిని గ్రహించి దాని వెలుగులో విజ్ఞానాన్ని, ఇంగిత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. చదువెప్పుడూ గ్రంథాశ్రయమే. నాడు తాటాకులు, నేడు ముద్రిత కాగితాల గుచ్ఛాలైన పుస్తకాలు. డిజిటల్ రాతలు, ఆన్‌లైన్ పుటలు వచ్చి ఇమెయిల్, వాట్సాప్‌ల ద్వారా గ్రంథస్థ అంశాలు క్షణాల్లో విశ్వమంతటికీ వ్యాపించగలుగుతున్నా అచ్చొత్తిన పుటల పురుళ్ళకు ఇంకా కాలం చెల్లలేదు.

సమీప, సుదూర భవిష్యత్తులో కూడా చెల్లబోదనే ధైర్యానికి చరమగీతం పాడగలవారు కనిపించడం లేదు. ఇ పేపర్లు వచ్చిన తర్వాత సైతం మామూలు వార్తా పత్రికల, మేగజైన్ల అవసరం తొలగలేదు. వాటి ప్రాబల్యం అడుగంటలేదు. అయితే ఏ పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నారు? కేవలం క్లాసు పుస్తకాలకు, సాంకేతిక విద్యకు సంబంధించిన పాఠ్య గ్రంథాలకే డిమాండ్ వుంది, సాహిత్యాన్ని కొని చదివేవారు బహు తక్కువ అనే అభిప్రాయమూ వుంది. పాఠ్య పుస్తకాల అవసరాలను తీర్చే దుకాణాలు అనేకం వున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఇవి విరివిగా కనిపిస్తాయి. ప్రతి రోజూ తెరుచుకొనే పుస్తకాల షాపులతో పాటు ఆదివారం నాడు కాలిబాటల మీద వెలిసే ఫుట్ పాత్ దుకాణాల్లోనూ అన్ని రకాల పాత పుస్తకాలు లభిస్తున్నాయి. ఇన్ని విధాలుగా పుస్తకాలు అందుబాటులో వున్నా చదువు కన్ను విశాలమవు తున్నది. జనంలో పుస్తక దాహం చల్లారడం లేదు. ఇంటింటి గ్రంథాలయాలతో అల్మారాలు, గదులు నిండిపోతున్నాయి.

జ్ఞానం లేని మనిషి నిజంగానే జంతువుతో సమానం. కేవలం శరీరం ఒక్కటే వుంటే చాలదు. బల్బులో వెలుగులా అందులో విజ్ఞాన కాంతి మెరుస్తూ వుండాలి. ఆ మెరుపు వెలుగులో మనుషులు మంచి దారిని ఎంచుకొని సమాజానికి కరదీపిక కాగలుగుతారు. ఆధునిక సాంకేతిక విప్లవం సమాచార వ్యాప్తికి విశేషంగా దోహదం చేస్తున్నది. వార్తా పత్రికలే కాకుండా రేడియో, సినిమా, టెలివిజన్, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం, విషయ పరిజ్ఞానం విస్తరిస్తున్నాయి. ఇలా వ్యాపిస్తున్న సమాచారంలో అనేక రంగాలకు సంబంధించిన తాజా పరిణామాల ఊసు వుంటుంది. వాటికి సంబంధించిన గ్రంథాలు వెనువెంటనే వెలువడుతుంటాయి. మామూలుగా ప్రతి రోజూ తెరుచుకొనే దుకాణాల్లో లభించే పుస్తకాలతో సంతృప్తి చెందని పాఠకులు ప్రత్యేక సందర్భాల కోసం ఎదురు చూస్తుంటారు.

సరికొత్తగా ప్రచురితమవుతున్న కవిత్వం, కథలు, నవలలు, వ్యాస సంపుటులు కూడా పుస్తక ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఏడాదికొకసారి జరిగే బుక్ ఫెయిర్ సంత) లకు జనం అనుదినం వేలాదిగా ఎగబడుతున్నారంటే పుస్తక ప్రియత్వం ఎంతగా పెరుగుతున్నదో, జనంలో జ్ఞానతృష్ణ ఎలా రగులుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అలా ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫెయిర్ 1985 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కొలువుదీరుతున్నది. నగరంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో ఈ నెల 22 నుంచి జరుగుతున్న 35వ జాతీయ బుక్ ఫెయిర్ ఈసారి విశేషంగా వార్తలకెక్కడం గమనించవలసిన విషయం. ఒక సర్కస్‌కో, వినోద ప్రదర్శనకో, గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాలకో, కార్తీక మాసంలో నిర్వహించే దీపోత్సవాలకో ఇసుక వేస్తే రాలనట్టుగా హాజరయ్యే మాదిరిగా బుక్ ఫెయిర్‌కి పుస్తక ప్రియులు తరలి రావడం నిజంగా సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తున్నది. మధ్య తరగతి ప్రజల్లో పుస్తక పఠన దాహం పెరగడం అక్కడి సమాజ ప్రగతికి నిదర్శనం.

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఇది ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. ఈ ఫెయిర్‌లో 340 స్టాల్స్ వున్నాయి. జనవరి 1 వరకు సాగే ఈ ఫెయిర్‌కి ప్రతి రోజూ వస్తున్న జనాన్ని చూసి పుర జనులు విస్తుపోతున్నారు. గత ఏడాది రోజుకి 10 లక్షల రూపాయల పుస్తకాలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో పుస్తకాలను కొనుక్కొంటున్నారని తెలుస్తున్నది. ముఖ్యంగా సాహిత్య పుస్తకాలను కొనే వారి సంఖ్య బాగా పెరగడం విశేషం. ఈ బుక్ ఫెయిర్ ప్రారంభం కావడానికి ముందు అనేక మంది రచయితలు తమ రచనలను ముద్రిస్తుండడం విశేషం. వారిలో ఉరకలెత్తుతున్న ఉత్సాహాన్ని చూస్తే సంబరం అంబరాన్ని తాకుతున్నది. చదవడం పెరిగింది, చదువరులు పెరిగారు, విజ్ఞాన విస్ఫోటనం సమాజాన్ని కొత్త పుంతలు తొక్కించాలన్న ఆశయం కూడా నెరవేరితే దాని ధాటికి దేశాన్ని పీడిస్తున్న జన విభజన రాజకీయాల వీపు చిట్లితే ఈ బుక్ ఫెయిర్‌ల వల్ల లోక కల్యాణం సిద్ధించినట్టే అవుతుంది. పుస్తకం హస్తభూషణమే కాదు, మస్తక వర్ధనం కూడా.

Think before you speak, read before you think Fran lebowitz

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News