నేడు సమాజంలో విలువల పతనం కొట్టొచ్చినట్టు స్పష్టంగా కనబడుతోంది. మానవుల్లో నైతిక విలువలు నశించడంతో అనేక దుష్పరిణామా లు సంభవిస్తున్నాయి. మనిషిలో అసూయ, ద్వేషం, స్వార్థం పెరిగిపోయి కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. దోపిడీ, దొంగతనం, హత్యలు, స్మగ్లింగ్ కిడ్నాప్ మొదలగునవి నిత్యకృత్యమైపోయాయి. కులాలపేరిట, మతాలమాటున ప్రతిరోజు ఏదో ఒక చోట మారణహోమాలు జరుగుతున్నాయి. మానభంగాలు, లైంగిక వేధింపులు, భ్రూణహత్యలు లాంటి అమానవీయ సంఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
నైతిక విద్య ద్వారానే ముందు తరాలు మంచి విలువలతో పెరిగి సమాజంలో శాంతి సంక్షేమాలు వెల్లివిరుస్తాయి. భారతదేశంలో ప్రాచీన విద్యా విధానం విద్యార్థులలో విలువలు పెంపొందించడానికి జ్ఞానం, నైపుణ్యం అలవడటానికి ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాచీన విద్యా విధానంలో నీతినియమాలను కేంద్రీకృతం తీసుకొని బోధన కొనసాగింది. నేడు ప్రాథమిక స్థాయినుంచి కళాశాలల స్థాయివరకు అనేక విద్యాసంస్థలు విద్యార్థులకు పోటీ ప్రపంచాన్ని అలవాటు చేయాలనే తపనతో నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ముందుకు పోతున్నాయి. నేడు మహిళలపై వరుసగా జరుగుతున్న అమానుష ఘటనలు, నేర ప్రవృత్తి, అసాంఘిక కార్యకలాపాలకు విరుగుడుగా నైతిక విలువలను ప్రత్యేక పాఠ్యపుస్తకంగా ఆరో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విద్యారంగంలో విలువల పతనం సామాజిక వ్యవస్థ అంతటికీ మచ్చతెస్తోంది. కొంతమంది విద్యార్థుల అనుచిత ప్రవర్తన నైతిక విలువలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నేటి ఆధునిక కాలంలో విద్యావిధానంలో వస్తున్న మార్పులు, విద్యాసంస్థల మధ్య వెర్రితలలు వేస్తున్న వ్యాపార పోటీ తత్వధోరణి బాలలను మార్కులు, ర్యాంకుల చుట్టూ మాత్రమే పరిభ్రమించేటట్లు చేస్తోన్నది. కార్పొరేటు పాఠశాలలు, కళాశాలలు, అందమైన బ్రోచర్లు, హోర్డింగులు, కరపత్రా ద్వారా తాము సాధించిన మార్కులు, ర్యాంకులు, ఐఐటి సీట్లను ప్రామాణికం చేస్తూ తాటికాయంత అక్షరాలతో ఆర్భాటంగా ప్రచారం చేయడాన్ని ప్రాధాన్యత చేసుకుంటున్నాయి. పాఠశాలల్లో విలువలు, నీతినియమాలు నేర్పించడానికి అవసరమైన సమయాన్ని కేటాయిస్తామని, విద్యార్థులు మంచి ఆదర్శపౌరులుగా రూపుదిద్దుతామని చెప్పే ఏ ఒక్క పాఠశాల, కళాశాల లేదంటే అతిశయోక్తి లేదు. కార్పొరేట్ చదువుల పుణ్యమా అని విద్యార్థులు చదువుల చట్రంలో ఊపిరి సలపనంతటి ఒత్తిడిలో కూరుకుపోతున్నారు.
విద్యపేరిట పక్కా వ్యాపారం చేస్తున్న పాఠశాలలు, కళాశాలలు దేశంలో లెక్కలేనన్ని ఉన్నాయి. ఇవి ర్యాంకుల కోసం విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. యాజమాన్యాలకు అండగా తల్లిదండ్రులు కూడా తోడవడంతో విద్యార్థులు తట్టుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పాఠశాల స్థాయిలో నైతిక అంశాలకు, విలువలకు, సూక్తులకు అవకాశం ఉన్న పాఠ్యాంశాలు ఎక్కువగా తెలుగు భాషలో మూడు నుంచి పదవ తరగతి వరకు ఉన్నాయి. వేమన శతకం, సుమతీ శతకం, మహాభారత నీతికథలు, చిన్నయ్య సూరి రాసిన స్నేహబంధం, శతక కవులు రాసిన శతక సుధ, శతక మధురిమ మొదలగునవి విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడానికి ప్రభుత్వం పాఠ్యాంశాలుగా పెట్టింది. అదే విధంగా సాంఘిక శాస్త్రంలో కుటుంబాలు, కుటుంబ రకాలు సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సమాజం, సమాజంలో పౌరుల పాత్ర, హక్కులు, విధులు లాంటి అంశాలు విద్యార్థులలో సహకార భావనలు, విలువలను పాదుకోల్పడానికి చేర్చడం జరిగింది.
నేడు అనేక ప్రైవేటు యాజమాన్యాలలో ఉన్న పాఠశాలల్లో తెలుగు, సాంఘిక శాస్త్ర బోధనను చిన్నచూపు చూస్తున్నాయి. రోజువారీ కాల పట్టికలో వాటికి పిరియడ్‌లు కేటాయించని పరిస్థితి నెలకొని ఉంది. వారంలో సగం రోజుల్లోనే వీటి బోధనను ముగించేస్తున్నారు. ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా అనేక కార్పొరేట్ కళాశాలలో తెలుగు, ఆంగ్ల పాఠ్యపుస్తకాలను వార్షిక పరీక్షల ముందు రెండు మాసాలలో ప్రారంభించి ముగిస్తున్నారు. రెండు మాసాల సమయంలో మార్కుల ప్రాతిపదికనే విద్యా బోధన ఉంటున్నది. ఇటువంటి పరిస్థితులలో పాఠశాల స్థాయినుంచి ఇంటర్మీడియట్ వరకు నైతిక అంశాలను, విలువలను విద్యార్థుల్లో పెంపొందించే పాఠ్యాంశాల బోధనకు ఆటంకం ఏర్పడి వాటికి విలువే లేకుండాపోతోంది. బాల్యంలో నేర్చుకోవాల్సిన నీతి నియమాలు, సత్ప్రవర్తన, విలువలు నిర్లక్ష్యం కావడంతో ఉన్నత విద్యావంతుల్లో విలువల పతనం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఉన్నత చదువులు చదివిన వైద్యుల్లో కొంతమంది డబ్బులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిర్మాణరంగంలో అనేక సంవత్సరాలు మన్నికగా ఉండాల్సిన కట్టడాలు ఇంజనీరింగ్ అధికారుల అవినీతి వలన కుప్పకూలిపోతున్నాయి. నేరాలు అరికట్టాల్సిన కొంతమంది పోలీసులు వాటికి కొమ్ముకొస్తున్నారు.
అన్యాయాలకు అక్కడక్కడ అండగా న్యాయవాదులు, ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న కల్తీ వ్యాపారులు, వేలకోట్ల రూపాయల దేశ సంపాదన కొల్లగొట్టి విదేశాలకు పారిపోతున్న బడాపార శ్రామికవేత్తలు మొదలగు వారంతా పెద్ద చదువులు చదివిన వారే కావడం గమనార్హం. విద్యార్థులకు మిగతా సబ్జెక్టుల మాదిరిగా నైతిక విలువలను ఒక పాఠ్యపుస్తకంగా పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విలువల విద్యను నూతన విషయం చేసి బోధించినట్లయితే విద్యార్థుల్లో ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు నైతిక విద్యను ప్రత్యేక పాఠ్యపుస్తకంగా విద్యార్థులకు ప్రవేశపెట్టి మిగతా సబ్జెక్టుల మాదిరిగా ఉత్తీర్ణత ఉత్తీర్ణత మార్కులు కేటాయించాలి. అదే విధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలో నైతిక విద్యను అన్ని గ్రూపులలో ఐచ్ఛిక విషయాలలో ఒకటిగా చేసి అర్హత సాధిస్తేనే పైతరగతికి అర్హులను చేయాలి. దీని బోధనకు గాను అత్యున్నతమైన అర్హతలు కల ఉపాధ్యాయులను, అధ్యాపకులను ప్రభుత్వం నియామకం చేయాలి. నీతి, నిజాయితీ, సత్ప్రవర్తన, విధినిర్వహణ, దయ, ధైర్యం, త్యాగం, సహకారం, ఆత్మగౌరవం, ధర్మం, సత్యం, శ్రద్ధ, గౌరవం లాంటి వాటికి నైతిక విలువల పాఠ్యపుస్తక రూపకల్పనలో ప్రాధాన్యత కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లయితే బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినట్లు అవుతుంది. సమాజంలో శాంతి నెలకొంటుంది.
బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి
94409 66416