Thursday, January 23, 2025

డిగ్రీ సైకాలజీలో ప్రవేశాల వెల్లువ

- Advertisement -
- Advertisement -

BC Gurukul Inter Degree Entrance Exam tomorrow

జాతీయోద్యమ కాలంలో వాణిజ్య, వైద్య, న్యాయ శాస్త్రాలకు మిక్కిలి గిరాకి ఉండేది. స్వాతంత్య్రానంతరం భౌతిక రసాయన జీవశాస్త్రాలు, అర్థశాస్త్రం, భాషాధ్యయనం, పారిశ్రామిక శిక్షణ, సాంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు విరివిగా జరిగేవి. ప్రపంచీకరణ అనంతరం ఇంజినీరింగ్, ఫార్మసీ, యాజమాన్య విద్య కీలకంగా మారాయి. ఇటీవల కరోనా దుష్పరిణామాల నేపథ్యంలో అందిరి దృష్టి సైకాలజీ పైకి మళ్లింది. ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు సైతం సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు పోటీపడుతున్నారు. ఇందుకు ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) లోనే గత విద్యాసంవత్సరంలో నాలుగు నుంచి ఐదు వేల మంది మానసిక శాస్త్రాధ్యాయులుగా ప్రవేశం తీసుకోవడమే ఒక ఉదాహరణ.

‘Highly meritorious stud ents are also choosing to study Psychology unlike earlier when they opted for professional courses such as Medicine, Engineering or Law. There is an increasing focus and interest in under standing the mind and the functioning of the brain’ Dr. Gitanjali Natarajan, (Professor, AIMS – Kochi)
బాలశిక్షతో మొదలైయ్యే చదువు, విశ్వవిద్యాలయంలోకి విద్యార్థి ప్రవేశించేటప్పటికి వందకు పైచిలుకు సబ్జెక్టులుగా విస్తరించి ఉంటుంది. తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని స్వేచ్ఛను ప్రస్తుత ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం విద్యార్థులకు కల్పిస్తోంది. బి.ఎ, బి.కాం, బి.ఎస్.సి కోర్సులు- సబ్జెక్టుల కాంబినేషన్ ను నిర్ణయించుకోవడానికి విద్యార్థికుండే ఆసక్తి ఒక కారణమైతే, అవసరమూ ఒక కారణం. అవసరం ఉపాధికి సంబంధించిందికాగా, ఆసక్తి మేధోశ్రమను ముందుకు తీసుకెళ్లేది. కారణమేదైనా కాలమాన పరిస్థితులను అనుసరించి ఒక్కో సమయంలో విద్యలోపల ఒక్కో కోర్సుకు డిమాండు ఉంటూ వస్తుంది. ప్రముఖ కవి, నవలాకారులు అమిత్ మజుందార్ చెప్పినట్టు ‘London is full of the sons of wealthier Indians, studying business or medicine or law (The Map Of The Scissors)’ జాతీయోద్యమ కాలంలో వాణిజ్య, వైద్య, న్యాయ శాస్త్రాలకు మిక్కిలి గిరాకి ఉండేది. స్వాతంత్య్రానంతరం భౌతిక రసాయన జీవశాస్త్రాలు, అర్థశాస్త్రం, భాషాధ్యయనం, పారిశ్రామిక శిక్షణ, సాంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు విరివిగా జరిగేవి. ప్రపంచీకరణ అనంతరం ఇంజినీరింగ్, ఫార్మసీ, యాజమాన్య విద్య కీలకంగా మారాయి. ఇటీవల కరోనా దుష్పరిణామాల నేపథ్యంలో అందిరి దృష్టి సైకాలజీ పైకి మళ్లింది. ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు సైతం సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు పోటీపడుతున్నారు. ఇందుకు ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) లోనే గత విద్యాసంవత్సరంలో నాలుగు నుంచి ఐదు వేల మంది మానసిక శాస్త్రాధ్యాయులుగా ప్రవేశం తీసుకోవడమే ఒక ఉదాహరణ. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలన్నిటిలో సగటున యాభై నుండి అరవై శాతం సైకాలజీ అడ్మిషన్లు పెరిగాయి.
పాత రోజులతో పోల్చుకున్నప్పుడు జీవితంలో అనేక సంక్లిష్టతలు చోటు చేసుకున్నాయి. తీవ్ర నిరాశ నిస్పృహల్లో, పని ఒత్తిడిలో, పరిసరాల దుష్ప్రప్రభావాల్లో జనాలు నలిగిపోతున్న దరిమిలా మానసిక వైద్యుల, వృత్తి నిపుణుల అవసరం దేశానికి ఇప్పుడు చాలా ఏర్పడింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, కంపెనీలు మెరుగైన సేవలు, ఉత్పత్తుల విస్తరణలో భాగంగా తమ తమ మానవ వనరుల (హెచ్.ఆర్) విభాగాల్లో శిక్షణ కోసం సైకాలజిస్టులను నియమించుకుంటున్నాయి. ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తే ప్రపంచ వ్యాప్తంగా ప్రజల అనుభవంలోని అత్యంత సాధారణ మానసిక స్థితులుగా నిరాశా నిస్పృహలు కనిపిస్తున్నాయి. ఇవి వ్యక్తిని సరియైన జీవితాన్ని గడపకుండా దీర్ఘకాలం పీడిస్తాయి. మనిషి లోపల బయట అనూహ్య చర్యలకు పురికొల్పుతాయి. మహాభారత ఇతిహాసంలో దుర్యోధనుడి ప్రాయోపవేశ సన్నివేశం నిరాశ, ఒత్తిడి కల్పించే ఘోర కృత్యానికి పరాకాష్ఠ. షేక్స్‌ఫియర్ సృష్టించిన ‘ఒథెల్లో’ పాత్ర విషాదమయ విపరీత మనోప్రవృత్తి ఇందుకో మచ్చు. ఆకలి దప్పికల్లో మార్పులు, నిద్రా సమస్య, వివిధ సందర్భాల్లో మనసును కలచివేసే ఉదాసీనత, అపరాధ భావన, వైమనస్యం, విముఖత, విరోధ చిత్తవృత్తి నిరాశా నిస్పృహలకు బలమైన చిహ్నాలు. ప్రాకృతిక విపరిణామాలు ఏ స్థాయి వ్యక్తులనైనా, ఏ కాలపు మనుషులనైనా నిరాశ నిస్పృహల్లోకి నెట్టుతాయి, బతుకు చక్రంలోని మోద ఖేదాలు, ఆక్రందన, అలజడి, వైఖరీ భేదాలు, పగ, ప్రతీకారం, మనో ప్రతిఫలనాల్లో భాగమేనని మనోవైజ్ఞానిక శాస్త్రం చెబుతున్నది. అయితే, ఆదిమ కాలం నుంచి పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల దాకా మానవాళి అనుభవించిన మనోకలతలు (సైకలాజికల్ డిజార్డర్స్) వేరు. ఆధునికత తెచ్చిన సమస్యల తాలూకు డిప్రెషన్ వేరు. పారిశ్రామికీకరణ అయితేనేమి, ప్రపంచీకరణ అయితేనేమి అభివృద్ధితో పాటు సమస్త ప్రజానీకం మీద తమకు గిట్టని క్రీనీడలనూ ప్రసరించింది. మానవ సంబంధాల విచ్ఛిత్తి జరిగింది. వ్యాపార ధోరణి ప్రబలి కుటుంబ సంబంధాలు శిథిలమైనాయి. వ్యక్తి నుంచి వ్యవస్థల వరకు టెక్నాలజీ తెచ్చిన వేగం అన్నిటినీ, అందరినీ మార్చేసింది. ఎవరూ, ఎక్కడా నిమ్మళంగా ఉన్నది లేదు. ఇదిట్లా ఉండగా కరోనా వ్యాధి మానవాళిని కబళించింది. జీవితం అతలాకుతలమై అభద్రత, అనిశ్చితి కోరసాచాయి. అన్నిరంగాలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. ప్రపంచ వ్యాప్త ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల కొత్తవి రాకపోగా ఉన్నవి పోవడం, రివర్స్ మైగ్రేషన్, కుటుంబాల్లో, సంబంధీకుల్లో ఎవరో ఒకరు మరణించడంతో ఆవరించిన భయాందోళనల మూలంగా ఇది వరకు లేని మానసిక రుగ్మతలు మనుషులను ముంచెత్తుతున్నాయి. వినాశక క్రిమిజాలం నోటిధాటికి, రకరకాల అంటువ్యాధుల తాకిడికి పల్లెలు, పట్టణాలనే వ్యత్యాసం లేకుండా భూగ్రహం మొత్తం మృత్యు భీతిలో ఎదుర్కొంటున్న డిప్రెషన్, తత్పర్యవసానాలు వేరు. ఇది అబ్నార్మల్ డిప్రెషన్. కొవిడ్ పరిభాషలో చెప్పాలంటే ‘గ్లోబ్ ఆన్ వెంటిలేటర్’ అన్నచందంగా పరిస్థితులు మారాయి. అందుకే ఇప్పుడు కాలేజీలకు, కమ్యూనిటీలకు, పరిశ్రమలకు, సంస్థలకు, సంఘాలకు ప్రతి ఒక్క చోటా, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక స్వస్థత, ఉపశమనం, మనోచికిత్స తప్పనిసరైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక -2017 ప్రకారం మన దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దేశంలో కేవలం తొమ్మిదివేల మంది మానసిక వైద్యులున్నట్టు సమాచారం. ఈ స్వల్ప సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ప్రతి కోటి మందికి ఏడుగురు సైకాలజీ కౌన్సిలర్లు మాత్రమే అందుబాటులో ఉన్న చెడ్డస్థితి. దీన్ని తప్పించేందుకు ఆయా విశ్వవిద్యాలయాలు సైకాలజీ గ్రాడ్యుయేట్ల తయారీకి గట్టిగా నిశ్చయించుకున్నాయి. విద్యార్థులూ సైకాలజీని తమ కెరీర్‌కు ఉత్తమమైందిగా భావిస్తున్నారు. జనసామాన్యంలో సైకాలజీ సబ్జెక్టు పట్ల దృక్పథమూ మారింది. Amity University ప్రొఫెసర్ రిటా కుమార్ ‘People started understanding the benefit of psychological counselling in preven ting mental health issues among different age groups and strata of the society. Students are opting for Clinical Psychology in large numbers. Coun selling Psychology is the second choice. Organi sation Psychology has also become very popular. Specialized diploma courses such as PG Diploma in Psycho-Oncology and PG Diploma in Counselling Psychology are also among the sought- after courses’ అంటూ సైకాలజీ విద్యా విభాగాల ఆవశ్యకతను గురించి వ్యాఖ్యానించడం గమనార్హం.
పాఠశాలలు మొదలు పరిశ్రమల దాకా అనేక సంస్థల్లో ఉపాధి దొరకడం, ప్రైవేట్ ప్రాక్టీస్ లాభదాయకంగా ఉండడం వల్ల మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సులతో సరిసమానంగా సైకాలజీ పట్టా కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు. ప్రవేశానికి ఏదేని డిగ్రీ అర్హత కాగా, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 99% మార్కుల కటాఫ్ వద్ద పి.జి సీట్లు నిండిపోతున్నాయంటే సైకాలజీలో ఎంతటి చురుకైన అభ్యర్థులు చేరుతున్నారో అర్థం కాగలదు. ముఖ్యంగా వ్యక్తుల ఆరోగ్యోన్నతి, స్వభావ చికిత్స, న్యూరో సైకలాజికల్ అసెస్‌మెంట్, ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్, ఫోరెన్సిక్ సైన్స్ విభాగాల్లో క్లినికల్ సైకాలజిస్టుల సేవలు కీలకం. అమెరికా, యూరోపు, ఆస్ట్రేలియా, మలేషియా దేశాలలో సైన్సుతో పాటు ఆర్ట్‌లో కూడా సైకాలజీ ఒక సబ్జెక్టుగా ఉంటుంది. సైకాలజీ ఆర్ట్ గ్రాడ్యుయేట్లు సాధారణంగా సోషల్ సైకాలజీ, క్రాస్ కల్చరల్ సైకాలజీ, ఇండస్ట్రియల్, ఆర్గనైజేషనల్ సైకాలజీలో స్పెషలైజేషన్‌నూ సైన్స్ గ్రాడ్యుయేట్లు క్లినికల్, న్యూరోసైకాలజీ, ఫిజియోలాజికల్ సైకాలజీ, ఫోరెన్సిక్ ఇతర సబ్-స్పెషాలిటీలనూ ఎంచుకుంటారు. మనస్తత్వవేత్తగా మారడం వలన వ్యక్తిగతంగా జీవితంలోని ఇబ్బందులను అధిగమించడానికి వీలుండడంతో పాటు మనో వైకల్యాలనూ ఎదుర్కోవడంలో సమాజానికి కావాల్సినంత సహాయపడవచ్చుననేది సైకాలజీ విద్యార్థుల మనోగతం. ఔను, ఐక్యరాజ్యసమితి నుండి వీధి అరుగు మీద ముచ్చటించుకునే మామాలు జనాల దాకా మాట్లాడుకునే ‘సుస్థిరాభివృద్ధి’కి అవసరమయ్యే వర్క్ ఫోర్స్‌కూ ప్రొఫెషనల్స్‌కూ భౌతిక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యమూ ప్రధానం కదా. ఈ మేరకు సైకాలజీ పట్టభద్రులు ఉపయోగపడితే అంతకంటే దేశానికి కావలసిందేముంది. ‘సా విద్యా యా విముక్తయే’ సూక్తి నిజం కావడం కంటే భరతమాతకు ప్రాప్తించాల్సిన భాగ్యమేముంటది.

డా. బెల్లియాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News