ముంబై : మగవారితో పోలిస్తే మహిళల్లోనే అత్యధికంగా యాంటీబాడీస్ ఉంటాయని, దీనితో వారు కరోనా వైరస్ దాడిని తేలికగా అధిగమించగలరని వెల్లడైంది. మనుష్యుల లాలాజలం, స్వేదం సేకరించి జరిపే సిరో సర్వేలో ఈ విషయం స్పష్టం అయింది. ప్రత్యేకించి ముంబైకి చెందిన పలు మురికివాడలు, కాలనీలు ఇతర ప్రాంతాలలో ఈ సమగ్ర సర్వేను స్థానిక పురపాలక సంస్థ నిర్వహించింది. ఇప్పుడు మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ నేపథ్యంలో పలు కీలక అంశాలు ఈ అధ్యయనంతో వెలుగులోకి వచ్చాయి.
ఈ క్రమంలో మహిళలు తక్కువ సంఖ్యలో వైరస్‌కు గురవుతున్న విషయాన్ని నిర్థారించారు. ఆడవారిలోని శారీరక నిర్మాణం, వారిలోని కొన్ని హార్మోన్ల కారణంగా రోగనిరోధక మూల కణాలుదండిగా ఉంటాయని, దీనితో వారు వైరస్‌కు తక్కువ స్థాయిలోనే గురి అవుతున్నారని తెలిసింది. రోగనిరోధకత మురికివాడలలో ఎక్కువగానూ ఇతర ప్రాంతాలలో తక్కువగానూ నమోదు అవుతోందని, అత్యధిక కేసులు ఇప్పుడు ఎక్కువగా కాలనీలలో, ఇతరత్రా నివాసిత ప్రాంతాలలో రికార్డు కావడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు. ముంబై మున్సిపాల్టీ చేపట్టిన సర్వే మేరకు మహిళలలో యాంటీబాడీస్ 37 శాతంగా, అదే పురుషులలో 35 శాతంగా ఉన్నట్లు నిర్థారణ అయింది.