Thursday, January 23, 2025

సంపాదకీయం: శతకోటీశ్వరులు!

- Advertisement -
- Advertisement -

CM KCR Federal movement దేశంలో 30 మిలియన్ల అమెరికన్ డాలర్ల (రూ. 226 కోట్లు) ఆస్తులు కలిగిన ఆధునిక అత్యధిక నికర విలువ (అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్) భాగ్యవంతుల సంఖ్య 2021లో 11 శాతం పెరగడం, ఎక్కువ మంది బిలియనీర్లు (బిలియన్ అమెరికన్ డాలర్లు గల అతి సంపన్నులు) కలిగిన దేశాల వరుసలో అమెరికా, చైనాల తర్వాత ఇండియా మూడో స్థానాన్ని సాధించడం ఏమి చెబుతున్నాయి? ఆర్థిక రంగంలో తెరుచుకున్న కొత్త అవకాశాలను ఉపయోగించుకొని అతి వేగంగా సంపద శిఖరాలందుకుంటున్న వారు దేశంలో పెరుగుతున్నారని స్పష్టపడుతున్నది. 2021లో రూ. 226 కోట్ల లేదా 30 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆస్తులున్న వారు ఏ దేశంలో ఎంత మంది ఉన్నారనే విషయంపై ఆరా తీసిన నైట్ ఫ్రాంక్ (knight frank) అనే సంస్థ ఆ వివరాలను మంగళవారం నాడు విడుదల చేసింది. బిలియనీర్ల జనాభాలో మొదటి స్థానంలో గల అమెరికాలో 748 మంది బిలియనీర్లున్నారు.

చైనాలో 554 మంది, ఇండియాలో 145 మంది వున్నారు. స్టాక్ మార్కెట్లు ఉచ్ఛస్థితిలో వుండడం, డిజిటల్ విప్లవం పురి విప్పడం వల్లనే ఆధునిక అత్యధిక నికర విలువ గల భాగ్యవంతుల సంఖ్య దేశంలో పెరిగిందని నైట్ ఫ్రాంక్ వివరించింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ నైపుణ్యం కలిగిన వారు కీలక సమాచారాన్ని ముందుగా చేజిక్కించుకొని త్వరితగతిన అనేక రెట్ల లాభాలు ఆర్జించిపెట్టే మదుపు మార్గాలను తెలుసుకొని వినియోగించుకుంటున్నారు. అందుచేతనే అతి పిన్న వయసులోనే (40 ఏళ్ల లోపు) రూ. 226 కోట్ల విలువైన ఆస్తులు సంపాదించుకున్నవారూ వున్నారంటే వారు ఎంత చురుకైన వారో అర్థం చేసుకోవచ్చు. వీరికి అందివచ్చిన అవకాశాలు 130 కోట్లకు పైబడిన మిగతా భారతీయులకు లభించకపోడం వల్లనే దేశంలో దారిద్య్రం తాండవమాడుతున్నదనుకోవాలి. లేదా చెమటోడ్చి ఆహారం, పరికరాలు మున్నగు వాటిని తయారు చేసి ఆర్థిక అభివృద్ధి యంత్రానికి కందెనగా ఉపయోగపడే కోట్లాది భారతీయుల శ్రమ వృథా అనుకోవాలి. కరోనా ఆర్థిక రంగాన్ని కబళించడానికి ముందు దేశ గ్రామీణ జనాభాలో పేదలు 35 శాతం (26 కోట్ల 50 లక్షలు) వరకు వుండేవారని వారి సంఖ్య ఇప్పుడు కనిష్ఠంగా 38 కోట్లకు గరిష్ఠంగా 41 కోట్లకు పెరిగి వుంటుందని గణాంకాలు చెబుతున్నాయి.

అలాగే పట్టణ జనాభాలో పేదల సంఖ్య కూడా పేదరికం ఇదే స్థాయిలో పెరిగిందని, ఇలా దారిద్య్రంలో కూరుకుపోయిన వారిలో అత్యధిక శాతం అణగారిన వర్గాలేనని వెల్లడైంది. జాతీయ స్థాయిలో 1320 శాతం మంది ఎస్‌సి, ఎస్‌టిలు అదనంగా దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయి వుంటారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. వ్యవసాయ తదితర రంగాల్లో స్వయం ఉపాధి మీద ఆధారపడి బతుకుతూ వచ్చిన వారు, రోజువారీ కూలీలు కరోనా లాక్‌డౌన్‌ల భారం కింద నలిగి నగ్గునుగ్గు అయిపోయారని రూఢి అవుతున్నది. ఆకలి అమితంగా వున్న 116 దేశాల జాబితాలో మన దేశం 101వ స్థానంలో వుండి అత్యధిక ఆకలి బాధితులున్న దేశంగా పరిగణన పొందడం మరొక విషాదకరమైన చేదు వాస్తవం. ఆకలి సూచీలో 2020లో 94వ స్థానంలో వున్న భారత దేశం మరింత దిగజారిపోయి 2021కి 101వ స్థానానికి చేరుకున్నది.

మన పొరుగునున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు మన కంటే తక్కువ ఆకలి గల దేశాలుగా నమోదు కావడం మనకు అదనపు ‘ప్రతిష్ఠ’ను తెచ్చే అంశం. ఇలా ఒక వైపు బిలియనీర్ల, ఆధునిక అత్యంత నికర విలువ గల వ్యక్తుల సంఖ్య పెరిగిపోతున్నందుకు ఎగిరిగంతేయాలా, పేదలు దేశ జనాభాలో 50 శాతానికి చేరుకోడాన్ని తలచుకొని కుంగిపోవాలా? బిలియనీర్ల సంపద వారు శ్రమించి గడించేది కాదని రోజుకు 1000 డాలర్ల వంతున పోగు చేసే వ్యక్తి బిలియన్ డాలర్లు వెనకేసుకోడానికి 2740 సంవత్సరాలు పడుతుందని, మిలియన్ డాలర్ల సంపన్నుడు కావడానికి మూడేళ్లు కావాలని, అన్యాయమైన, దోపిడీ పునాదుల మీద ఏర్పాటైన ఆర్థిక వ్యవస్థలో మాత్రమే మిలియనీర్లు, బిలియనీర్లు తయారవుతారని, వారు వుండనే కూడదని అమెరికన్ డెమొక్రాట్ల నేత బెర్నీ శాండర్స్ అన్నారు. ఇందులో ఆక్షేపించదగినదేమీ లేదు. పది మంది కష్టపడి, శ్రమించి పోగు వేసే సంపద ఒకరిద్దరి గుప్పెట్లో బందీ కావడం, మిగతా వారు ఆ సంపదకు దూరమై దారిద్య్రంలో కూరుకుపోడం జరుగుతున్న చోట న్యాయమైన పంపిణీని ఆశించలేము. అయితే అమెరికాలో గాని, ఇండియాలో గాని పోగు పడుతున్న సంపద మదుపుగా, పెట్టుబడిగా మారి శ్రమశక్తిని ఉపయోగించి జాతి సంపదను సృష్టించే వైపు మళ్లితే అది అసంఖ్యాకులకు ఉద్యోగ, ఉపాధులను కల్పిస్తుంది. అలా కాకుండా ఆ సంపద సోమరిగా ఒక చోట పడి వుంటే దాని వల్ల అనర్థాలే ఎక్కువ. బిలియనీర్లు అత్యధికంగా వున్న దేశాల్లో అమెరికా తర్వాత రెండవ స్థానంలో వున్న చైనా ఆకలి దేశాల సూచీలో అతి తక్కువ క్షుదార్తులున్న మొదటి ఐదులోపు దేశాల్లో ఒకటిగా వుండడం గమనించవలసిన విషయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News