హైదరాబాద్: తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టిఎస్ఆర్ టిసి నడుపుతోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనర్ ఐపిఎస్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయని, ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేశామని, అక్కడి నుంచి ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నామని వివరించారు.
రెండేళ్లకో సారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగా 6 వేల ప్రత్యేక బస్సులను టిఎస్ ఆర్ టిసి నడపుతోందని, జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటోందని, భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు పెద్ద సంఖ్యలో బస్సులను మేడారం జాతరకు నడుపుతున్నామని, రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగిందని విసి సజ్జనర్ తెలియజేశారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందని, కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టిసి సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నామని, తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని సజ్జనర్ విజ్ఞప్తి చేశారు.