వెంటనే అదనపు 50 కంపెనీల తరలింపు
పరిస్థితిపై రెండో రోజూ అమిత్ షా సమీక్ష
శాంతిభద్రతల పరిరక్షణకు ఆదేశాలు
త్వరలోనే హోం శాఖ బృందాల పర్యటన
రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి బాసట
న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరుసగా రెండో రోజు కూడా మణిపూర్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. దిగజారుతున్న శాంతిభద్రతలను వెంటనే దారిలోకి తీసుకురావాల్సి ఉందని ఉన్నతాధికారులను ఆయన సోమవారం ఆదేశించారు. మణిపూర్‌కు అవసరమైన స్థాయిలో కేంద్రీయ బలగాల తరలింపు నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్‌లో పరిస్థితిని అదుపులో పెట్టేందుకు అక్కడికి కేంద్ర ప్రభుత్వం ఈ వారంలోనే అదనంగా 50 సిఎపిఎఫ్ బలగాలను తరలిస్తుంది. ఇందులో భాగంగా 5 వేలకు పైగా జవాన్లు వెళ్లుతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అదనంగా సిఆర్‌పిఎఫ్ నుంచి 15, బిఎస్‌ఎఫ్ నుంచి 5 దళాలను తరలించింది.
ఈ నెల 12 న తలెత్తిన ఉద్రిక్తత నివారణకు పలు చర్యలు చేపడుతున్నారు. పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోవడంతో ఈ వారంలోనే మరిన్ని బలగాలను తరలిస్తారని అధికారులు తెలిపారు. గత వారం తరలించిన బలగాలతో ఇప్పటికే రాష్ట్రంలో 218 కేంద్రీయ బలగాల దళాలు మకాం వేసి ఉన్నాయి. బలగాల తరలింపు ద్వారా శాంతి పునరుద్ధరణ, ఘర్షణల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలోనే హోం మంత్రిత్వశాఖ బృందాలు రాష్ట్రంలో పర్యటిస్తాయని కూడా వెల్లడైంది. ఈ ఈశాన్య రాష్ట్రంలో తెగల నడుమ చిచ్చు ఇప్పుడు సంక్లిష్టతకు దారితీసింది.
పలు ప్రాంతాలలో ఉద్రిక్తతలు శృతి మించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులతో హోం మంత్రి సమీక్ష జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్రీయ బలగాలను అవసరాన్ని బట్టి పంపించడం జరుగుతుందని వివరించారు. ఆదివారం కూడా మణిపూర్ పరిస్థితిపై హోం మంత్రి సమీక్ష జరిపారు. మైతీలపై కుకీల దాడులు, చివరికి సహాయక శిబిరాల నుంచి కొందరిని బందీలుగా చేసుకుని వెళ్లడం, వీరిలో కొందరిని చంపివేయడం వంటి దారుణాలతో మణిపూర్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడింది.