మన తెలంగాణ/సిటీ బ్యూరో: హత్యలూ, దోపిడీలూ, మోసాలూ, మానభంగాలూ. పేరేదైనా కావచ్చు భాగ్యనగరంలో క్రైం అనేది రూపం మార్చుకుంటోందే తప్ప అంతరించే ఛాయలు కనిపించట్లేదు. క్రైమ్ అనేది అంతర్జాలానికి బయట లోపల కూడా పొంచి ఉన్న ఒక ఉచ్చులా మారింది. సైబర్ క్రైమ్ ద్వారా చోటు చేసుకుంటున్న ఆర్ధిక మోసాలను ఎంత కట్టడి చేసినా కెటుగాళ్ల మాటల గారడీతో ప్రజలు మోసపోతునే ఉన్నారు. ఈమోసాలకు కొంత మంది అత్యాశపరులు, మరికొంత మంది తమ అవసరాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా నిరుద్యోగులను లక్షంగా చేసుకుని ఆకర్షించే ప్రకటనతో నిలువు దోపిడి చేస్తున్నారు. సైబర్ నేరాలు జరగడానికి నేరగాళ్ళెంత వరకూ కారణమో, తమకే తెలియకుండా వారికి సహకరించే నెటిజన్లు కూడా చాలా వరకూ కారణమేనని పోలీసులు చెప్పుకొచ్చారు. పోలీసుల కథనం ప్రకారమే 2020 సంవత్సరంలో నగరంలో 22,000 కు పైగా నేరాలు జరుగగా గత ఏడాది వాటి సంఖ్య 20,000 తగ్గినట్లు వారు వెల్లడించారు. ఏడాది కాలంలో 10 శాతం నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు. నేరాలను అదుపు చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొంత మంది విలాసాల కోసం మరికొంత మంది నేర ప్రవృత్తినే వృత్తిగా చేసుకుని కరుడు గట్టిన నేరగాలుగా మారుతూ దొంగ తనాలకు పాల్పడమే కాకుండా కిరాతకంగా వ్యవహరిస్తూ దోపిడిలకు తెగబడుతున్నట్లు తమ విచారణల్లో వెలుగు చూస్తున్నాయని పోలీసులు వెల్లడించారు.
అనేక రూపాల్లో నేరాలు:
ఇటీవల ఓ మనిషిని కిరాకతంగా హత్య చేయడమే కాకుండా మొండెం నుంచి తలను వేరు చేసి దానిని తీసుకువెళ్లి సాగర్ హైవే దగ్గర కాళికాదేవి ఆలయంలో అమ్మవారి పాదాల వద్ద పెట్టడం లాంటి దారుణమైన కేసులు చోటు చేసుకోవడం నేరగాళ్ల కిరాతకాన్ని తెలియజేస్తోంది. అదేవిధంగా ఎస్.ఆర్ నగర్ లో తాళం వేసి ఉన్న స్టాక్ మార్కెట్ వ్యాపారి శేఖర్ ఇంటిలోకి చొరబడి వెండీ, బంగారం, పాతిక లక్షల రూపాయలు దోచుకెళ్ళిన దొంగతనం కేసులాంటివి నగరంలో కోకొల్లంగా చోటు చేసుకుంటున్నాయి. కరోనా లాక్ డౌన్ వల్ల బిజినెస్ దివాలా తీయడంతో నకిలీ ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ల అవతారమెత్తి, నానక్ రామ్ గుడాలో రియలెస్టేట్ వ్యాపారి ఇంట్లో తనిఖీల పేరుతో దోపిడి కేసు మరో రకం నేరానికి ఉదాహరణ.గంజాయి విక్రయం కేసులో జైలు కెళ్లిన భర్త బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న 27 ఏళ్ల మహిళను ఆమె అవసరాన్ని ఆసరాగ చేసుకుని
బెదిరించి అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ మహ్మద్ జహంగీరిది మరో రకం కేసు. నారాయణ గూడాలో ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట ఒక అరవై యేళ్ళ పెన్షన్ దారు నుంచి ఒక యాప్ ద్వారా ముందు లాభాలు చూపించి తరువాత పదిలక్షల రూపాయల దాకా కాజేసిన సైబర్ దొంగల కేసు. ఇలా ఎటు చూసినా జంటనగరాలలో క్రైమ్ అనేది రోజురోజుకూ పెరుగుతూ పోతోందే తప్ప తగ్గట్లేదు.
నేరాలు చేయడం కూడ మానసిక లోపమే:
నేరం చేయాలనే బుద్ధి పుట్టడం మానసికంగా కూడా ఒక లోపమని న్యూరాలజీ ఆఫ్ క్రిమినల్ బిహేవియర్ కు సంబందించిన వైద్య నిపుణులు తెలిపారు. నేరస్థులను శిక్షించడం మాత్రమే కాకుండా, సాటి మనిషి విలువలు, దొంగతనం చేయడం నేరమని, నీతి, నిజాయితీకి ఉన్నవిలువ గురించీ ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. మనిషిలోనిఅభద్రతాభావన ఖైదీల్లోనూ,నేరస్థుల్లోనూఎక్కువగాఉండే అవకాశముందనీ వారిని చైతన్యవంతులుగా మార్చేందుకు సైకోసిస్‌లోమోటివేషనల్ కౌన్సిలింగ్‌ఇవ్వడం వల్ల నేరస్థుడిలోని ఉన్మాది లక్షణాలు క్రమంగాతగ్గే అవకాశముందని తెలిపారు.