Thursday, December 26, 2024

అయోధ్యలో తొక్కిసలాట, కిటకిటలాడుతున్న పుణ్యక్షేత్రం

- Advertisement -
- Advertisement -

అయోధ్య నగరం రామ భక్తులతో కిటకిటలాడుతోంది. కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని మంగళవారంనుంచి భక్తులకోసం తెరుస్తున్నట్లు ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో, బాలరాముణ్ని దర్శించుకోవాలని దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చారు. ఒక దశలో ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది.

సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులు ఆలయం వద్దే పడిగాపులు పడటం కనిపించింది. మరునాడు ఉదయం బాలరాముడి దర్శనం కోసం వారు రాత్రంతా ఆలయం వద్దే వేచి ఉన్నారు. అయోధ్య రామ మందిరానికి దారితీసే వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య దద్దరిల్లుతోంది. కొందరు భక్తులు తెల్లవారుజామున మూడు గంటలనుంచి ఆలయ ప్రాంగణానికి చేరుకోవడం కనిపించింది. మరికొందరు భక్తులు సరయు నదిలో పుణ్యస్నానం ఆచరించి, రాములవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం 7నుంచి 11.30 గంటలవరకు, మధ్యాహ్నం 2.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకూ భక్తుల్ని ఆలయంలోకి అనుమతిస్తున్నారు.

Ayodhya rammandir

అయోధ్యకు తండోపతండాలుగా వస్తున్న భక్తకోటిని చూసి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆచార్య సత్యేంద్ర దాస్ పులకించిపోయారు. ‘అయోధ్యకు మళ్లీ త్రేతాయుగం నాటి రోజులు వచ్చాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన అనంతరం అయోధ్యకు పూర్వవైభవం దక్కింది. రాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చాక నగరం కళకళలాడింది. అదే విధంగా ఇప్పుడు బాలరాముడి రాకతో అయోధ్య నగరం కళకళలాడుతోంది’ అని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News