Thursday, January 23, 2025

ఓం శివోహం.. రుద్ర నామం భజేహం..

- Advertisement -
- Advertisement -

మహాశివరాత్రి పర్వదినాన కీసరకు పోటెత్తిన భక్తులు
మిన్నంటిన ఓంకార నాధం
జనసంద్రాన్ని తలపించిన కీసరగుట్ట
101 శివలింగాల పూజలో తరించిన భక్తులు

More Devotees in Keesara
మన తెలంగాణ/కీసర: మహా శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రమైన కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు భక్తుల ఓంకార నాధంతో మిన్నంటాయి. ఏ నోట విన్న శివనామస్మరణే, ఏ వైపు చూసిన శివలింగ అభిషేక దృశ్యాలే దర్శనమిచ్చాయి. శ్రీరామలింగేశ్వరుడి దర్శనార్ధం తరలివచ్చిన భక్తులతో కీసరగుట్ట జనసంద్రాన్ని తలపించింది. భక్తులు కొండపై కొలువైన 101 శివలింగాలకు అభిషేకాలు, పూజలు నిర్వహించి తరలించారు. మంగళవారం తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. క్యూలైన్ల ప్రవేశ ద్వారం నుంచి ఉద్యానవనం చివరి వరకు భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. సోమవారం సాయంత్రానికి సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, వంశరాజ్ సంక్షేమ సంఘం, రాజస్థాన్ మిత్ర మండలి తదితర సంస్థల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సోలీస్ కంటి ఆసుపత్రివారు భక్తులకు పాలు పంపిణీ చేశారు. పలు స్వచ్చంద సంస్థలు భక్తులకు సేవలందించాయి.

స్వామి వారికి సంతతధారాభిషేకం

రుద్రయాగ సహిత బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్థరాత్రి లింగోద్బవ కాలంలో శ్రీరామలింగేశ్వర స్వామి వారికి వేద మంత్రోచ్చరణతో సంతతధారాభిషేకం నిర్వహించారు. ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, రుద్రస్వాహకార హోమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి నందివాహన సేవ ఘనంగా జరిగింది. సోమవారం రాత్రి శ్రీ భవాని శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్పవం కనుల పండువగా నిర్వహించారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జల్లా కలెక్టర్ హరీష్, ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతి శర్మ, ఇఓ కట్ట సుధాకర్‌రెడ్డి దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి ఆనవాయితీ ప్రకారం మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ హరీష్ ప్రభుత్వ పరంగా పట్టు వస్త్రాలను అందజేశారు.

స్వామి సేవలో సిఎం కెసిఆర్ మనవడు హిమాన్స్, ఇతర ప్రముఖులు

మహాశివరాత్రి పర్వదినాన పలువురు ప్రముఖులు శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రి చామకూర మల్లారెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ మనమడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్స్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, పలువురు హైకోర్టు న్యామూర్తులు, ఉన్నతాధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభ స్వాగతం కలికిన అర్చకులు స్వామి వారి దర్శనం అనంతరం ఆశీర్వచనాలు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News