భారీ వర్షానికి తగ్గని భక్తులు
దర్శనానికి 5 నుంచి 8 గంటల సమయం
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతోపాటు జోరుగా వర్షం కురుస్తుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా క్యూ లైన్‌లలోనే భక్తులు నిలబడాల్సి రావడంతో వారికి ఇక్కట్లు తప్పడం లేదు. ఈ నెల 15వ తేదీకి ముందు స్వామి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టేది. ప్రస్తుతం అధికారులు చర్యలు తీసుకోవడంతో దర్శనానికి 5 నుంచి 8 గంటల సమయం పడుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంది.
రద్దీ ఎక్కువ కావడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్ల నిర్వహణ, భక్తులను నిలువరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా కిలోమీటర్ల మేర భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. రద్దీకి తోడు ట్రాఫిక్ సమస్యలు భక్తులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. వాహనాల రద్దీ కారణంగా భారీ ట్రాఫిక్‌జాం కావడంతో పంబ చేరుకొని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టమవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు సుమారు లక్ష పైచిలుకు భక్తులు దర్శనానికి వస్తుండడంతో ఈసారి భక్తులకు ఇబ్బందులు ఎక్కువయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు.