Monday, January 20, 2025

యాదగిరీశుడి క్షేత్రంలో భక్తజనుల సందడి

- Advertisement -
- Advertisement -

శ్రీవారి ఆలయ నిత్యరాబడి రూ.35.52 లక్షలు
స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

మనతెలంగాణ/యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహుడి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులతో యాదాద్రి సందడిగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం భక్తజనులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు అర్చన, అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు సర్వదర్శనాలను కల్పించారు. కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో వచ్చిన భక్తులు శ్రీలక్ష్మీనారసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో జరిగిన సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, నిత్యబ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణపుష్పార్చన, సత్యనారాయణస్వామి వ్రత పూజలలో భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. యాదాద్రి కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి స్వామి వారిని దర్శించుకొని తరించారు. అనుబంధ ఆలయమైన శ్రీపాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో స్వామి వారి దర్శన క్యూలైన్లు, ప్రసాద విక్రయ కేంద్రం, సత్యనారాయణస్వామి వ్రత మండపం, కల్యాణకట్ట, స్వామివారి పుష్కరిణితో పాటు కొండపైన, కొండ కింద పలు ప్రాంతాలు రద్దీగా మారాయి.

ఆలయ నిత్యరాబడి..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యరాబడి రూ.35,52,253 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.15,86,700, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,02,450, బ్రేక్ దర్శనం ద్వారా రూ.3,32,700, వీఐపీ దర్శనం ద్వారా రూ.3,30,000, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.4,50,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,05,116, కల్యాణకట్ట ద్వారా రూ.1,05,000 తో పాటు ఆలయంలోని తదితర శాఖలు, పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం నుండి ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

నారసింహుడి సేవలో ప్రభుత్వ విప్..

More devotees in Yadadri

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న అయిలయ్య కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనంతో స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News