మరింత ఆదాయం పెంచుకునే దిశగా ఎక్సైజ్ శాఖ కసరత్తు
అదనంగా 25 శాతం ఫీజును చెల్లిస్తే అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆబ్కారీ ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరింత ఆదాయం పెంచుకునేలా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు, దాదాపు 1,200 బార్లు, క్లబ్లు ఉన్నాయి. వీటితో పాటు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 140 ఎలైట్ బార్లు ఉండగా మరో 100 నుంచి 200ల వరకు ఎలైట్ బార్లకు అనుమతి ఇస్తే ఎలా ఉంటుందన్న విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నట్టుగా తెలిసింది. 2014,-15లో మద్యం అమ్మకాలు, లైసెన్స్‌ల జారీ, ఇతరత్ర మార్గాలతో రూ.10,833 కోట్ల ఆదాయం రాగా, 2022, -23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.34,857 కోట్ల ఆదాయం వచ్చింది. 2014, -15 ఆర్థిక ఏడాది నుంచి 2022, -23 ఆర్థిక సంవత్సరం వరకు చూస్తే ఎక్సైజ్ శాఖ ఆదాయం మూడు రెట్ల కంటే ఎక్కువ రాబడి నమోదు కావడం విశేషం. 2022, -23 ఆర్థిక ఏడాదిలో 34 ఎక్సైజ్ జిల్లాల పరిధిలో రూ.35,145 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2023,-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.30,000 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఆర్థిక ఏడాది గత ఆర్థిక ఏడాది కంటే కనీసం రూ.2,000 కోట్లు అదనంగా రాబడి ఆబ్కారీ శాఖతోనే వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 140 ఎలైట్ బార్లు
ఈ క్రమంలోనే ఇటీవల ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎలైట్ బార్లు, రెస్ట్రారెంట్లను అదనంగా ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ దిశలో కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సాధారణ మద్యం దుకాణాలతో పాటు ఒకే ఒక్క ఎలైట్ మద్యం దుకాణం, దాదాపు 140 వరకు ఎలైట్ బార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎలైట్ బార్లు, మద్యం దుకాణాలు ఏర్పాటుకు ఇప్పుడు రెగ్యులర్ లైసెన్స్ ఫీజు కంటే 25 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దుకాణాల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ఎలైట్ లైసెన్స్ జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఇదిలా ఉండగా, ఎలైట్ బార్లు లేదా ఎలైట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చే వ్యాపారులు ఎక్కడ ఏర్పాటు చేస్తారో అక్కడ అమలు అవుతున్న లైసెన్స్ ఫీజులో 25 శాతం అదనంగా చెల్లించినట్లయితే బార్లుకానీ, దుకాణాలుకానీ తెరచుకోడానికి అనుమతి ఇచ్చేందుకు శాఖ పరంగా చొరవ చూపాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ పేర్కొంటుంది. అయితే దుకాణాలు అదనంగా ఏర్పాటు చేసినంత మాత్రాన మద్యం అమ్మకాలు పెరగడం, రాబడి అధికంగా వచ్చే అవకాశం ఉంటుందా లేదా అన్న విషయమై అధికారులు ఆలోచిస్తున్నారు.